Resolve Problems… సమస్యల పరిష్కారానికి ‘దారి’ చూపాలని..
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:11 AM
Show the ‘Way’ to Resolve Problems… జిల్లాలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రహదారుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా .. అవి కనీస మరమ్మతులకు నోచుకోలేదు. కొన్నాళ్లుగా నిర్వహణకు నోచుకోకపోవడంతో పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి. రాళ్లు తేలి.. భారీ గుంతలతో దర్శనమిస్తున్నాయి.
నేడు జిల్లాకు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి రాక
ప్రతిపాదనలకు మోక్షం కల్పించాలని మన్యం వాసుల విన్నపం
పార్వతీపురం, ఏప్రిల్4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రహదారుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా .. అవి కనీస మరమ్మతులకు నోచుకోలేదు. కొన్నాళ్లుగా నిర్వహణకు నోచుకోకపోవడంతో పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి. రాళ్లు తేలి.. భారీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా రహదారుల నిర్మాణాలతో పాటు మరమ్మతుల పనులు కూడా చేపడుతోంది. ఇప్పుడిప్పుడే రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. అయితే మన్యంలో చాలా చోట్ల రోడ్లు, వంతెనలు, కాజ్‌వేల నిర్మాణాలు, మరమ్మతులకు అధికారుల నుంచి ప్రతి పాదనలు వెళ్లాయి. వాటికి గ్రీన్‌సిగ్నల్ రావల్సి ఉంది. కాగా నేడు జిల్లాలో ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో మన్యంలో పరిస్థితిపై ప్రత్యేక కథనం.
ఇదీ పరిస్థితి..
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో సాలూరు మండలం బాగువలస- పాయకపాడు వరకు చేపట్టిన రహదారి పనులను మధ్యలో నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించినా.. ఈ పెండింగ్ పనులు పూర్తి కాలేదు.
- పార్వతీపురం పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఎదురుచూస్తున్నారు. దీని నిర్మాణానికి రూ.85 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి.
- కొమరాడ మండలంలో జంఝావతి నదికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో క్రాస్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది.
- సాలూరు పురపాలక సంఘం పరిధి పాచిపెంట రోడ్డు రహదారి పనులు, విస్తరణకు రూ.20కోట్లు అవసరమని ప్రతిపాదనలు వెళ్లాయి. సాలూరు పురపాలక సంఘ పరిధి వట్టిగెడ్డ వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. దీని కోసం రూ.12 కోట్లు అవసరం. సాలూరు- దలైవలస రోడ్డు మధ్యలో సువర్ణముఖి నది వద్ద హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. దీని కోసం రూ.12 కోట్లు అవసరం. ఈ విధంగా జిల్లాకు సుమారు రూ.155 కోట్లు అవసరం.
- కురుపాం-పీటీమండ రోడ్డు మధ్యలో రూ.1.30 కోట్లతో కాజ్‌వే నిర్మాణానికి పంపించిన ప్రతిపాదనలకు మోక్షం కల్పించాల్సి ఉంది.
- జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అతిఽథి గృహం లేదు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న అతిథిగృహం పట్టణానికి దూరంగా ఉండడంతో.. అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన అతిఽథిగృహం ఉన్నా.. అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీని స్థానంలో కొత్త భవనం నిర్మాణానికి ఇప్పటికే అధికారులు రూ. 4.20 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. దీనికి మోక్షం కల్పించాలని జిల్లాకేంద్రవాసులు కోరుతున్నారు.
మంత్రి పర్యటన ఇలా..
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు సీతానగరం చేరుకుంటారు. సువర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మక్కువ-అజ్జాడ రహదారిని ప్రారంభిస్తారు. 11:45 గంటలకు అరసాడ రహదారికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పీబీకే రోడ్డును ప్రారంభిస్తారు. 1.30 గంటల నుంచి 2 గంటల వరకు ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ శాఖాధికారులతో సమీక్షిస్తారు. అనంతరం మంత్రి పార్వతీపురం నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురం చేరుకుంటారు.