Shortage of VROs వీఆర్‌వోల కొరత
ABN , Publish Date - May 17 , 2026 | 12:20 AM
Shortage of VROs భోగాపురం మండలంలో 16 సచివాలయాలు ఉండగా 8 సచివాలయాలకు మాత్రమే గ్రామ రెవెన్యూ కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన 8 సచివాలయాలకు పక్క సచివాలయ అధికారులు ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్నారు. ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి మరో సచివాలయ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై అదనపు పనిభారం ఉంటోంది.
వీఆర్‌వోల కొరత
జిల్లాలో 131 పోస్టులు ఖాళీ
మిగిలిన వారిపై పెరిగిన పనిభారం
విజయనగరం కలెక్టరేట్, మే 16(ఆంధ్రజ్యోతి):
- భోగాపురం మండలంలో 16 సచివాలయాలు ఉండగా 8 సచివాలయాలకు మాత్రమే గ్రామ రెవెన్యూ కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన 8 సచివాలయాలకు పక్క సచివాలయ అధికారులు ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్నారు. ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి మరో సచివాలయ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై అదనపు పనిభారం ఉంటోంది.
- కొత్తవలస మండలంలో మొత్తం 21 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో 14 సచివాలయాలకు గ్రామ రెవెన్యూ కార్యదర్శలు ఉండగా, మిగిలిన వాటికి లేరు. అటువంటి చోట్ల ఇన్‌చార్జిలే విధులు నిర్వహిస్తున్నారు. గంట్యాడ మండలంలో 22 గ్రామ సచివాలయాలు ఉండగా నాలుగు సచివాలయాలకు గ్రామ రెవెన్యూ కార్యదర్శులు లేరు.
జిల్లాలోని చాలా మండలాల్లో వీఆర్‌వోల కొరత ఉంది. పూర్తిస్థాయిలో రెవెన్యూ కార్యదర్శులు లేక మిగిలినవారిపై పనిభారం పడుతోంది. గ్రామాల్లో రెవెన్యూ కార్యదర్శలకు కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అప్పగించే ప్రతి పనికి వీరే బాధ్యులు. వీరు లేనిచోట ఇన్‌చార్జిలతో పనులు సాగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రెవెన్యూ సమస్యలతో పాటు ఓటు హక్కు నమోదు, పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారం, సర్వేలు ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 982 రెవెన్యూ గ్రామాల్లో 620 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటికి 530 పోస్టులు మంజూరు అయ్యాయి. 399 మంది విఽధులు నిర్వహిస్తుండగా 131 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలా సచివాలయాల పరిధిలో రెండు లేదా అంతకు మించిన గ్రామాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పనిచేసేవారు కొరత ఉండటంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. కొన్నిచోట్ల కార్యదర్శులు నాలుగు నుంచి ఐదు గ్రామాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిపై పని భారం తీవ్రంగా ఉంటోంది. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఆయా గ్రామాల్లో పాలన మెరుగవుతుంది.