Share News

Shop closed దుకాణం బంద్‌

ABN , Publish Date - May 15 , 2026 | 12:07 AM

Shop closedకమర్షియల్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగాక జిల్లాలో హోటళ్లు, చిరుతిళ్ల వ్యాపారం డీలాపడింది. రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్డుపక్కన ఉండే టీ, టిఫిన్‌ సెంటర్లు, చాట్‌బళ్లు, నూడిల్స్‌ సెంటర్లు, బేకరీలు, క్లౌడ్‌ కిచెన్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై ‘బండ’ పడినట్లయింది. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర వరుసగా పెరుగుతూ ప్రస్తుతం రూ.3 వేలు దాటింది. దీంతో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు 10 నుంచి 20 శాతం పెరిగాయి.

Shop closed దుకాణం బంద్‌
రాజాంలో మూతపడిన ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌

దుకాణం బంద్‌

హోటళ్లు, చిన్న షాపులపై గ్యాస్‌ ధరల ప్రభావం

కమర్షియల్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగాక అనూహ్య మార్పులు

వరుసగా మూత పడుతున్న షాపులు

హోటల్‌ కార్మికులపై ఉపాధి ప్రభావం

రాజాం రూరల్‌, మే 14(ఆంధ్రజ్యోతి):

కమర్షియల్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగాక జిల్లాలో హోటళ్లు, చిరుతిళ్ల వ్యాపారం డీలాపడింది. రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్డుపక్కన ఉండే టీ, టిఫిన్‌ సెంటర్లు, చాట్‌బళ్లు, నూడిల్స్‌ సెంటర్లు, బేకరీలు, క్లౌడ్‌ కిచెన్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై ‘బండ’ పడినట్లయింది. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర వరుసగా పెరుగుతూ ప్రస్తుతం రూ.3 వేలు దాటింది. దీంతో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు 10 నుంచి 20 శాతం పెరిగాయి.

పశ్చిమాసియా దేశాలలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కమర్షియల్‌ సిలిండర్‌ ధర మూడుసార్లు పెరిగింది. మార్చిలో రూ.144, ఏప్రిల్‌ 1న సుమారు రూ.200, ఏప్రిల్‌ ఆఖరున రూ.993 పెరిగింది. వరుసగా గ్యాస్‌ ధరలు పెరగడంతో చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. వారి ఆదాయానికి గండి పడుతోంది. గడచిన మూడునెలలుగా పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న కొంతమంది హోటళ్ల నిర్వాహకులు కట్టెలపై వంటలు చేయిస్తున్నారు. మార్కెట్లో పేరున్న, బ్రాండెడ్‌ హోటళ్లు ఆ మార్గాన్ని ఎంచుకోలేక కమర్షియల్‌ సిలిండర్లనే కొనుగోలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.

హోటల్‌ కార్మికుల ఉపాధిపైనా..

జిల్లావ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు, వీధి శివార్లలో నిర్వహిస్తున్న చిన్నచిన్న టీ దుకాణాలు, హోటళ్ల వ్యాపారులు పునరాలోచనలో పడడంతో వాటిలో పనిచేసే వందలాది మంది కార్మికుల ఉపాధిపై పెను ప్రభావమే పడుతోంది. వారి ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు పెంచామని, మరోసారి ధర పెంచితే కస్టమర్లు రావడం మానేస్తారని, ధరలు పెంచకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో రూ.20కి నాలుగు ఇడ్లీలు ఇచ్చే చిన్నచిన్న హోటళ్లలో ప్రస్తుతం రూ.20కి మూడు ఇడ్లేలే ఇస్తున్నారు. ఇదే పరిస్థితి మిగిలిన టిఫిన్‌, ఫాస్ట్‌ఫుడ్‌పైనా కనిపిస్తోంది. ఫుడ్‌ పార్సిల్‌ ధర గతంలో రూ.100కే లభ్యం కాగా ప్రస్తుతం పార్శిల్‌ ధర జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలలో ఆయా హోటళ్ల స్థాయిని బట్టి రూ.120 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది.

గత్యంతరం లేకే..

లక్ష్మణరావు, హోటల్‌ నిర్వాహకుడు, రాజాం

గ్యాస్‌ ధర అమాంతం పెరగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టిఫిన్‌, ఫుడ్‌, పార్సిళ్ల ధరలు పెంచాల్సి వచ్చింది. లేకపోతే నష్టం భరించాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలను దృష్టిలో పెట్టుకుని హోటళ్ల వ్యాపారం నిర్వహించడం లేదు. కొనసాగించడమే సవాల్‌గా మారింది.

ఆదాయం తగ్గిపోయింది

రమణయ్య, కార్మికుడు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌

నేను నాలుగేళ్లుగా రాజాంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాను. నూడుల్స్‌, ఫిష్‌ ఫ్రై, జాయింట్స్‌, చికెన్‌ పకోడా వంటి ఫుడ్‌ తయారుచేస్తే రోజుకి రూ.800 వచ్చేది. ప్రస్తుతం వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మరేపని చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.

Updated Date - May 15 , 2026 | 12:07 AM