విద్యుదాఘాతానికి 15 గొర్రెలు సహా కాపరి మృతి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:14 AM
విద్యుదాఘాతానికి గొర్రెల కాపరి ఉప్పిలి బంగారయ్య(30) మృతి చెందాడు.
అగనంపూడి (విశాఖపట్నం), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతానికి గొర్రెల కాపరి ఉప్పిలి బంగారయ్య(30) మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 15 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని అగనంపూడి ఇండస్ర్టియల్ ఏరియా సమీపంలో గల ఓ ప్రైవేటు లేఅవుట్ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కిత్తన్నపేట గ్రామానికి చెందిన కొందరు సుమారు 800 గొర్రెల మంద తో ఇక్కడకు వచ్చారు. ఇండస్ర్టియల్ ఏరియా సమీపంలో గల లేఅవుట్‌లోని నివాస సముదాయాలకు ఆనుకొని గొర్రెల మందను విడిచిపెట్టారు. చీకటి పడడంతో మందను తీసుకెళ్లే ప్రయత్నంలో 15 గొర్రెలు ఒక చోట ఉన్నాయి. వాటికోసం వెళ్లిన బంగారయ్యకు అప్పటికే తెగి పడిన విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న గొర్రెలు 15 మృత్యువాత పడ్డాయి. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మూడు నెలల క్రితం మందతో ఇం టి నుంచి బయలుదేరి వచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.