Share News

28న గొర్రెల పెంపకందారుల

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:26 PM

జిల్లా గొర్రెల పెంపకందారుల కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షులు, డైరక్టర్ల ఎన్నిక ఈ నెల 28న విజయనగరంలోని గురజాడ రోడ్డులో ఉన్న పశు సంవర్థకశాఖ కార్యాలయంలో జరగనుంది.

 28న గొర్రెల పెంపకందారుల
పశు సంవర్థకశాఖ కార్యాలయం

కో-ఆపరేటివ్‌ డైరక్టర్ల ఎన్నిక?

- చేతులెత్తే పద్ధతిలోనే..

- ఏర్పాట్లు చేస్తున్న పశు సంవర్థకశాఖ అధికారులు

విజయనగరం రూరల్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా గొర్రెల పెంపకందారుల కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షులు, డైరక్టర్ల ఎన్నిక ఈ నెల 28న విజయనగరంలోని గురజాడ రోడ్డులో ఉన్న పశు సంవర్థకశాఖ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు జిల్లా పశు సంవర్థక శాఖాధికారులకు సమాచారం అందింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ ఎన్నికలు జూలైలో పూర్తయ్యాయి. రెండు జిల్లాల పరిధిలో యాక్టివ్‌లో ఉన్న 105 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడంతో జిల్లా స్థాయిలో అధ్యక్షులు, డైరక్టర్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ ఎన్నికను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించనున్నారు. 105 సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు అంతా డైరక్టర్లను ఎన్నుకుంటారు. ఈ 12 మంది డైరక్టర్లలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ డైరకర్ల పదవుల కోసం నామినేషన్ల స్వీకరణ, 12 గంటల నుంచి 12.30 వరకూ నామినేషన్ల పరిశీలన, 12.45కు బరిలో ఉన్న డైరక్టర్ల జాబితా అధికారిక ప్రకటన, మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకూ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ఎన్నిక, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్‌ ఫీజుకి సంబంధించి బీసీలు రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. 12 మంది డైరక్టర్లలో ఒకటి ఎస్సీ లేదా ఎస్టీలకు, మరొకటి బీసీలకు, మిగతావి ఇతరులకు కేటాయించనున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:26 PM