Shattered Hopes! నేలవాలిన ఆశలు!
ABN , Publish Date - May 03 , 2026 | 12:13 AM
Shattered Hopes! జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోయింది. ప్రధానంగా జీడి, మామిడి, అరటి, వరి పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
నేలకొరిగిన మామిడి, జీడి, అరటి, వరి
నష్ట పరిహారం చెల్లించాలంటున్న రైతులు
పాలకొండ, మే2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోయింది. ప్రధానంగా జీడి, మామిడి, అరటి, వరి పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో జీడి, మూడు వేల ఎకరాలకు పైగా మామిడి , 15 వేల ఎకరాల్లో అరటి, 18 వేల ఎకరాల్లో రబీ వరి పంటలు సాగవుతున్నాయి. అయితే ఈ వాణిజ్య పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు అకాల వర్షాలు తీ వ్రంగా నష్టపరిచాయి. ఈదురుగాలులకు పలు మండలాల్లో అరటి పంట పూర్తిగా పలు నేల మట్టమైంది. మరికొద్దిరోజుల్లో పక్వానికి రానున్న మామిడి నేలరాలింది. జీడి పచ్చికాయలన్నీ నేలరాలాయి. మరోవైపు బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలు, మొక్కజొన్న, నువ్వును కల్లాల నుంచి ఇంటికి తరలించలేని పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఉద్యాన, వ్యవసాయ శాఖాధికా రులు పర్యటించి.. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరు తున్నారు.
- గరుగుబిల్లి: మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా వరికి నష్టం వాటిల్లింది. చిలకాం పంచాయతీ దత్తివలస, కారివలస, చిలకాంలో సుమారు 200 ఎకరాల్లో వరి పంట నేల మట్టమైంది. అప్పులు చేసి రబీ వరి సాగు చేపట్టామని, ప్రస్తుతం అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటంతా నేలకొరిగిందని రైతులు వాపోతున్నారు. మదుపులు కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. దీనిపై ఏవో టి.జ్యోత్స్నను వివరణ కోరగా.. భారీ గాలులు కారణంగా నష్టం వాటిల్లిన పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామన్నారు.
చెట్లు కూలితేనే పరిహారం...
జీడి, మామిడి చెట్లు కూలితేనే పరిహారం వర్తించే అవకాశం ఉందని ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో గాలులకు జీడి, మామిడి నేలకొరినా పరిహారం అందని పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా పలు మండలాల్లో అరటి పంట నేలమట్టమైనా... సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించిన దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవానికి ఆరు నెలలు దాటిన అరటి పంట అకాల వర్షాలు, ఈదురుగాలులకు నేలరాలితే పరిహారం చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అరటిపంట నేలకొరిగింది. రెండు ఎకరాల్లో పంటను నష్టపోయా. ప్రభుత్వం ఆదుకోవాలి.
- పప్పల సంగారావు, రైతు, కొదమ
================================
నష్టపరిహారం చెల్లించాలి
వేలాది రూపాయలు వెచ్చించి అరటి సాగు చేపట్టాం. అకాల వర్షంతో ఇప్పుడిప్పుడే పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలి.
-ఎడ్ల సింహాచలం, చిన్న కొదమ
================================
ప్రాథమికంగా అంచనా వేశాం
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి సుమారు 50 ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశాం. మామిడి, జీడి పంటల విషయానికొస్తే .. ఆయా చెట్లు నేలకొరిగితేనే పరిహారం వర్తింపజేయాలని నిబంధనలు ఉన్నాయి. . పంట నేలకొరిగితే పరిహారం వచ్చే అవకాశం లేదు.
- సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖాధికారి