శత్రుచర్ల కన్నుమూత
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:23 AM
విప్లవ యోధుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు.
- ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా గెలుపు
- ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగు
- రవాణా శాఖ, అటవీ శాఖ మంత్రిగా సేవలు
- ఉత్తరాంధ్ర టైగర్‌గా గుర్తింపు
- నేడు అంత్యక్రియలు
పార్వతీపురం/జియ్యమ్మవలస, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): విప్లవ యోధుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయం త్రం తుది శ్వాస విడిచారు. 1948 ఆగస్టు 4న చినమేరంగి జమిందార్ వంశంలో శత్రుచర్ల జన్మించారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందారు. ఉత్తరాంధ్ర టైగర్‌గా ఆయనకు పేరుంది. కరోనా సమయంలో తన చెల్లి పార్వతీపురం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ వీటీ నరసింహప్రియ థాట్రాజ్, మేనకోడలు పార్వతీపురం ఎంపీపీ హరిప్రియ థాట్రాజ్, సోదరుడు నాగూరు మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, మేనల్లుడు మాజీ ఎమ్మెల్యే వీటీ జనార్ధన్ థాట్రాజ్ వరుస మరణాలతో ఆయన మానసికంగా కృంగిపోయారు. అప్పటి నుంచి తన ధర్మపత్ని శత్రుచర్ల శశికళాదేవి ఇచ్చిన మనోధైర్యంతో అభిమానులు, కార్యకర్తల మధ్య సరదాగా గడిపారు. అయితే, కుటుంబ సభ్యులందరూ దూరమయ్యారనే బాధ, ఆవేదనతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
రాజకీయ అరంగేట్రం
- జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో 1948 ఆగస్టు 4న శత్రుచర్ల జన్మించారు. గిరిజన సహకార సంస్థలో సామాన్య ఉద్యోగిగా పనిచేశారు. తన 30వ ఏటా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1978లో జనతా పార్టీలో చేరారు.
-1978-83 మధ్య జనతా పార్టీలో నుంచి నాగూరు నియోజకవర్గం(కురుపాం) ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత తన ప్రియ స్నేహితుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టారు.
- 1983-85, 1985-89లో నాగూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
- 1985-86లో ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.
- 1989-91లో పార్వతీపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
- 1990లో అటవీ, పర్యావరణ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.
- 1991-96లో పార్వతీపురం ఎంపీగా రెండోసారి గెలిచారు.
- 1998-99లో పార్వతీపురం ఎంపీగా మూడోసారి ఎన్నికయ్యారు.
- 2004-09 మధ్య కాలంలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో అటవీ, పర్యావరణ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు.
- 2009-14లో పార్వతీపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రవాణాశాఖ మంత్రిగా, 2010 నుంచి రెండోసారి అటవీ, పర్యావరణ, సాంకేతికశాఖ మంత్రిగా పనిచేశారు.
- తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కోసం తన తమ్ముడు శత్రుచర్ల చంద్రశేఖరరాజు (మాజీ ఎమ్మెల్యే) కుటుంబాన్ని సైతం పక్కన పెట్టిన ముక్కు సూటి మనస్తత్వం ఆయనది.
- 2017నుంచి 2023 మధ్య కాలంలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై పెద్దల సభలో అడుగుపెట్టారు.
కార్యకర్త మాదిరిగా కృషి.
విజయరామరాజుకు ఉత్తరాంధ్ర పులిగా, ముక్కుసూటి మనిషిగా పేరొంది. తనను నమ్ముకున్న వారి కోసం ఎంత వరకైనా వెళ్లేవారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేవారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విజయం కోసం ఒక కార్యకర్త వలే పని చేసేవారు. తన తమ్ముడు చంద్రశేఖర్ రాజు ఎమ్మెల్యేగా, సోదరి నరసింహప్రియ థాట్రాజ్ పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేందుకు కృషి చేశారు. శత్రుచర్లకు సంతానం లేకపోవడంతో సోదరి కుమారుడు జనార్దన్ థాట్రాజ్‌ను పెంచుకున్నారు. థాట్రాజ్‌ను ఎమ్మెల్యే చేసి చట్టసభల్లో అడుగుపెట్టించారు. ప్రస్తుత ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అనారోగ్యానికి గురైనప్పటికీ జగదీశ్వరి గెలుపు కోసం తీ వ్రంగా శ్రమించి సఫలీకృతులయ్యారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని చెప్పవచ్చు.
శోకసంద్రంలో ఉత్తరాంధ్ర
శత్రుచర్ల మృతితో ఉత్తరాంధ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త విని ఎందరో అభిమానులు, నాయకులు విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. తన ప్రతీ సభలో మొదట ప్రజలందరికీ ‘మీ విజయరామరాజు విప్లవ జోహార్లు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించేవారు. ఆయన మృతి పట్ల మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయ ప్రకాష్‌నారాయణ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, కురుపాం జడ్పీటీసీ వీరేష్‌చంద్రదేవ్ తదితరులు సంతాపం తెలిపారు.
నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
మాజీ మంత్రి విజయరామరాజు మృతి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు తీరని లోటని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. శత్రుచర్ల మృతి తనకు ఎంతో బాఽధ అనిపించిందని మత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు. ఈ మేరకు చినమేరంగిలో ఏర్పాట్లు చేస్తున్నారు.