Share News

బాలికపై లైంగిక దాడి

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:12 AM

జిల్లా కేంద్రం విజయనగరంలో 14 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు

  బాలికపై లైంగిక దాడి

-ముగ్గురు యువకులపై పోక్సో కేసు

- అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

విజయనగరం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం విజయనగరంలో 14 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. బాలిక తండ్రి దివ్యాంగుడు. తల్లి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తురాలు. బాలిక తన పాఠశాలలో చదువుతున్న మరో విద్యార్థితో చనువుగా ఉండేది. దీన్ని చూసిన అదే కాలనీకి చెందిన ముగ్గురు యువకులు (స్నేహితులు) శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌, అక్షయ్‌కుమార్‌ బాలికను బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ‘మీ ఇద్దరి వ్యవహారంపై మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. మా కోరిక తీర్చకపోతే, మీ విషయాన్ని బయట పెడతాం.’ అని బెదిరించి ఆమెను లోబర్చుకున్నారు. ఇలా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకురమ్మని బాలికను ఇబ్బంది పెట్టేవారు. లేదంటే దుర్భాషలాడి ఇబ్బందులకు గురిచేసేవారు. దీంతో ఈ నెల 1న బాలిక ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. గత ఏడాది నుంచి తాను పడుతున్న నరకం గురించి ఎస్పీకి చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యింది. ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ నరసింహరావు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. పూర్తి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. బుధవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్‌ విధించింది.

Updated Date - Sep 04 , 2026 | 12:12 AM