'Sewage' for eight years.. ఎనిమిదేళ్లుగా ‘మురుగు’తూ..
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:42 PM
'Sewage' for eight years.. పెద్ద చెరువులో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తే నగర వాసులకు 5ఎంఎల్‌డీ తాగునీరును అందించే అవకాశం కలుగుతుందన్న ఆలోచనతో 2018లో శ్రీకారం చుట్టారు. అమృత్ పథకం ఫేజ్2లో భాగంగా రూ.19.92కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. కొంతకాలం వరకూ పనులు జరిగాయి. దాదాపు రూ.6కోట్లు ఖర్చు అయ్యాయి. ఆ తరువాత ఒక్క ఇటుకబెడ్డ కూడా పడలేదు.
ఎనిమిదేళ్లుగా ‘మురుగు’తూ..
నీటిశుద్ధి ప్లాంట్ పూర్తయ్యేనా?
2018లో రూ.20కోట్ల అంచనాతో నిర్మాణం ప్రారంభం
అప్పట్లో రూ.6కోట్ల వరకూ ఖర్చు
పూర్తిగా ఆగిన పనులు
పెద్ద చెరువులో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తే నగర వాసులకు 5ఎంఎల్‌డీ తాగునీరును అందించే అవకాశం కలుగుతుందన్న ఆలోచనతో 2018లో శ్రీకారం చుట్టారు. అమృత్ పథకం ఫేజ్2లో భాగంగా రూ.19.92కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. కొంతకాలం వరకూ పనులు జరిగాయి. దాదాపు రూ.6కోట్లు ఖర్చు అయ్యాయి. ఆ తరువాత ఒక్క ఇటుకబెడ్డ కూడా పడలేదు.
విజయనగరం టౌన్, మార్చి18(ఆంధ్రజ్యోతి):
నగరవాసులకు మరింత తాగునీరు అందించాలనే సదుద్దేశంతో ఇరవై ఏళ్ల క్రితమే నగరంలోని పెద్దచెరువును ఆనుకుని మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని పాలకులు, అధికారులు ఆలోచించారు. 2018లో ఆ దిశగా కీలక అడుగు పడింది. అప్పటి టీడీపీ ప్రభుత్వ నేతలు పబ్లిక్‌హెల్త్ అధికారుల ఆధ్వర్యంలో అమృత్ పథకం ఫేజ్2లో భాగంగా రూ.19.92కోట్లతో నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత కొంతకాలం వరకూ రూ.6కోట్ల మేర పనులు చేశారు. నిర్మాణం చురుగ్గా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా పనులు ఆపేశారు. నేటికి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా ఏ ఒక్కరూ శుద్ధిప్లాంట్ నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో నగరవాసులకు మెరుగైన తాగునీరు అందించడం కలగానే మిగిలిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయితే నగరవాసులకు 5ఎంఎల్‌డీ తాగునీరు అందే అవకాశం ఉంది.
40 ఎంఎల్‌డీ తాగునీరు అవసరం
ప్రస్తుతం నగరంలోని 3లక్షల50వేలకు పైగా జనాబా నివాసం ఉంటున్నారు. వీరి అవసరాలకు 40 ఎంఎల్‌డీ నీరు కావాలి. అంతమేర నీరు అందించాలంటే నగరంలో తగినంత నీటి వనరులు అందుబాటులో లేవు. ఇప్పటికే నెల్లిమర్ల, తాటిపూడి పంప్‌హోస్‌ల నుంచి 26ఎంఎల్‌డీ తాగునీరు పంపిణీ అవుతోంది. వేసవికాలం ఆరంభం అయితే అదే ప్రాంతాల నుంచి 16ఎంల్‌డీ నీరు మాత్రమే అందుతుంది. దీంతో గత కొన్నేళ్లుగా తోటపల్లి, ఆండ్ర ప్రాజెక్టుల నుంచి నీటిని తెప్పించి నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ వేసవి ఆరంభం నుండే నగరవాసులకు నీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.20కోట్లతో మంజూరైన నీటిశుద్ధి కేంద్రాన్ని పూర్తిచేసినట్టయితే నగరవాసులకు మరో ఐదు ఎంఎల్‌డీ నీరు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల నీటి ఇక్కట్లు తప్పుతాయి.
ఊసే ఎత్తని వైసీపీ ప్రభుత్వం
2019 నుండి 2024వరకూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీటి శుద్ధి కేంద్రం వైపే చూడలేదు. నాటి పాలకులు కీలక ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారు. మొక్కుబడి సుందరీకరణ పనులపై ఉన్న దృష్టి తాగునీటిపై లేకపోయిందని అప్పట్లోనే స్థానికులు విమర్శించేవారు.
మళ్లీ లెటర్ పెట్టాలి
నీటిశుద్ధి కేంద్రం పనులను 2018లో పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో చేపట్టారు. రూ.ఆరుకోట్ల మేర పనులు పూర్తిచేశారు. దీనిపై సంబంధిత ఈఈతో మాట్లాడాను. ఆస్కీమ్ క్లోజ్ చేశారంటున్నారు. మళ్లీ పబ్లిక్ హెల్త్ నుంచి లెటర్ పెట్టాలి. పూర్తి బాధ్యత వారిదే తప్పా మా చేతుల్లో ఏమీ లేదు.
- బాలస్వామి, కమిషనర్, నగరపాలక సంస్థ