Share News

పన్ను బకాయిల లెక్కతేల్చండి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:29 PM

బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలోని హుగ్లీ జూట్‌మిల్లు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

పన్ను బకాయిల లెక్కతేల్చండి
హుగ్లీ జూట్‌మిల్లు స్థలాన్ని చదును చేసిన దృశ్యం

- గత మునిసిపల్‌ అధికారుల పాత్రపై కూడా విచారణ చేపట్టండి

- ప్రభుత్వం ఆదేశాలు

- మళ్లీ తెరపైకి హుగ్లీ జూట్‌మిల్లు వ్యవహారం

బొబ్బిలి జూలై 3 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలోని హుగ్లీ జూట్‌మిల్లు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పూర్తిగా మూతపడి రియల్‌ ఎస్టేట్‌గా మారిన ఈ జూట్‌మిల్లు స్థలానికి సంబంధించి ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను విధింపు, వసూలు లెక్క తేల్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్థానికుల ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారిని ఆదేశించింది. గతంలో పనిచేసిన మునిసిపల్‌ కమిషనరు సత్తారు శ్రీనివాసరావుతో పాటు ఆర్వో ప్రసాద్‌ ఇతర రెవిన్యూ సిబ్బందిపై కూడా దర్యాప్తు చేపట్టాలని బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి.

ఇదీ పరిస్థితి..

2011-12లో కోల్‌కతాకు చెందిన హుగ్లీ జూట్‌ మిల్లును రాజాంకు చెందిన యాజమాన్యం కొనుగోలు చేసింది. అప్పటికే ఈ జూట్‌మిల్లు రూ.1.13 కోట్ల ఆస్తిపన్ను బకాయి మునిసిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. ఐదేళ్ల తరువాత ఈ మిల్లును ఆ యాజమాన్యం మూసివేసింది. ఈ స్థలాన్ని రియల్‌ఎస్టేట్‌గా మార్చేందుకు జరిగే ప్రయత్నంలో మిల్లులోని యంత్ర సామగ్రిని తరలించేందుకు జరిగిన ప్రయత్నాలను మునిసిపల్‌ అధికారులు అప్పట్లో అడ్డుకున్నారు. ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. జూట్‌మిల్లు స్థలాల క్రయవిక్రయాలపై ఫ్రీజింగ్‌ చేయాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాలతో ఆ స్థలాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో 2020లో రూ.1.13 కోట్ల ఆస్తిపన్ను బకాయిలను మునిసిపాలిటీకి జూట్‌ యాజమాన్యం చెల్లించింది. ఆ వెంటనే మిల్లులోని యంత్రాలను తరలించింది. ఆ తరువాత మొత్తం 4.72 ఎకరాల జూట్‌మిల్లు స్థలానికి సంబంధించి రూ.6 లక్షల చొప్పున ఖాళీ స్థలాల పన్ను (వేకెండ్‌ ల్యాండ్‌ టాక్స్‌-వీఎల్‌టీ) అధికారులు విధించారు. దీని ప్రకారం మునిసిపాలిటీకి వీఎల్‌టీ కింద రూ.55 లక్షలు చెల్లించాలన్నది మున్సిపాలిటీ వాదన.

- దీనిపై విజిలెన్స్‌ అధికారులు, మున్సిపల్‌ ఆర్డీలు గతంలో పలుదపాలు దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. విజిలెన్స్‌ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.1.44 కోట్లు వీఎల్‌టీ చెల్లించాలని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట మున్సిపల్‌ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాస్తూ జూట్‌మిల్లు వీఎల్‌టీని ప్రాపర్టీ టాక్స్‌గా మార్చాలని కోరారు.

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియ జరగడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సహజంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. ప్రాపర్టీ టాక్స్‌, వీఎల్‌టీలను విధించేందుకు అవసరమైన మార్గదర్శకాలు, నిబంధనలను పాటించలేదన్న ఫిర్యాదు మేరకు అప్పట్లో పనిచేసిన మునిసిపల్‌ కమిషనర్‌, రెవెన్యూ అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఏవైనా అవకతవకలు జరిగాయా? ఇందులో ఎవరెవరి పాత్ర ఎంతెంత? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇది మా పరిధిలో లేని అంశం

హుగ్లీ జూట్‌ మిల్లుకు సంబంధించిన వ్యవహారంలో గతంలో పనిచేసిన అధికారులపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. వాస్తవానికి దీనిపై వివరాలు వెల్లడించడం మా పరిధిలో లేని అంశం. ప్రభుత్వం నియమించే అధికారి దీనిపై దర్యాప్తు నిర్వహిస్తారు.

- లాలం రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌, బొబ్బిలి

Updated Date - Jul 03 , 2026 | 11:29 PM