Set up the venture... lay the road... వెంచర్ వేసుకో.. రోడ్డు నిర్మించుకో..
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:18 AM
Set up the venture... lay the road... అనగనగా ఓ రియల్ వ్యాపారి. చీపురుపల్లిలో అనుమతుల్లేని వెంచర్ వేశాడు. బ్రిడ్జి కోసం రైతుల పేరిట దరఖాస్తు చేశాడు. అధికారులు గుడ్డిగా అనుమతి ఇచ్చారు. ఇంకేం.. సదరు రియల్టర్ తోటపల్లి కాలువపై బ్రిడ్జినే కట్టించాడు. నీటిప్రవాహానికి అడ్డుగా పిల్లర్ నిర్మించాడు. కస్టమర్ల సౌలభ్యం కోసం మట్టిరోడ్డునూ వేశాడు.
వెంచర్ వేసుకో.. రోడ్డు నిర్మించుకో..
మేం కళ్లు మూసుకుంటాం!
చీపురుపల్లిలో రియల్ వ్యాపారి బరితెగింపు
రైతుల పేరుతో తప్పుడు దరఖాస్తు
దారి కోసం తోటపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం
కాలువ మధ్యలో తాత్కాలిక మట్టి రోడ్డు
అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
అనగనగా ఓ రియల్ వ్యాపారి. చీపురుపల్లిలో అనుమతుల్లేని వెంచర్ వేశాడు. బ్రిడ్జి కోసం రైతుల పేరిట దరఖాస్తు చేశాడు. అధికారులు గుడ్డిగా అనుమతి ఇచ్చారు. ఇంకేం.. సదరు రియల్టర్ తోటపల్లి కాలువపై బ్రిడ్జినే కట్టించాడు. నీటిప్రవాహానికి అడ్డుగా పిల్లర్ నిర్మించాడు. కస్టమర్ల సౌలభ్యం కోసం మట్టిరోడ్డునూ వేశాడు. ఇంతచేసినా అధికారులు అటువైపు వెళ్లలేదు. కనీసం నోటీసులూ ఇవ్వలేదు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా వారు కదల్లేదు. దీంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చీపురుపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి ప్రాంతంలో అనుమతులు లేకుండా ఓ రియల్ వ్యాపారి వేసిన లేఅవుట్ రెడ్డిపేట-విజయరాంపురం రోడ్డుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి కుడి ప్రధాన కాలువ ఎడమ గట్టే ఆధారం. ఈ కారణంగా కాలువ ఎడమ గట్టును ఎక్సకవేటర్‌తో చదును చేయించేశాడు. ఈ వెంచరు కుడి ప్రధాన కాలువ 103వ కిలోమీటరు వద్ద ప్రవాహానికి కుడి వైపున ఉండడంతో కస్టమర్లను కాలువ దాటించాల్సిన అవసరం ఏర్పడింది. దీని కోసం ఆ వ్యాపారి కాలువపై సొంతంగా బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించాడు. ఆ ప్రాంతానికి చెందిన రైతుల పేరుతో అధికారులకు లేఖ రాసి బ్రిడ్జి నిర్మాణానికి అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందాడు. అంతటితో ఆగకుండా వెంచర్‌కు వచ్చే కస్టమర్ల కోసం కాలువకు అడ్డంగా తాత్కాలికంగా మట్టి రోడ్డు కూడా వేసేశాడు. కాలువకు అడ్డంగా మట్టి గట్టును గమనించిన స్థానిక రైతులు పీజీఆర్‌ఎస్ ద్వారా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమస్య ఎంత దూరం వెళ్తుందోనని ఆందోళన చెందిన ఆ వ్యాపారి తక్షణమే మట్టి గట్టును తొలగించి, బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేశాడు.
అనుమతులు లేకుండానే వెంచరు
రైతుల ప్రయోజనాల పేరుతో కుడి ప్రధాన కాలువపై బ్రిడ్జి నిర్మిస్తున్న ఆ వ్యాపారి వెంచర్ నిర్మాణానికి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం గమనార్హం. చీపురుపల్లి మండలంలోని రావివలస, గరివిడి మండలంలోని శివరాం గ్రామాల రెవెన్యూ పరిథిలో సుమారు 150 ఎకరాల్లో ఈ వెంచరు విస్తరించి ఉంది. కేవలం గ్రావెల్‌తో రోడ్లు వేసి, హద్దు రాళ్లపై ప్లాట్ నంబర్లు వేసి, పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నా రెవెన్యూ గాని, పంచాయతీ అధికారులు గాని అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
అనుమతి ఉత్తర్వుల ప్రతులు ఇవ్వలేం
తోటపల్లి కుడి ప్రధాన కాలువపై బ్రిడ్జి నిర్మాణం కోసం కొంతమంది రైతులు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశారు. ఆ మేరకు రైతుల ప్రయోజనార్థం సొంతంగా బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రతులను బయటకు ఇవ్వలేం.
- సుచిత్ర, డీఈ, తోటపల్లి ప్రాజక్టు, చీపురుపల్లి