Share News

సర్వర్‌ స్లో

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:35 AM

ప్రధానమంత్రి పసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకం నమోదుకు సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు చేసే సమయంలో చాలా ఎక్కువ సమయం తీసుకుంటోంది.

సర్వర్‌ స్లో

సర్వర్‌ స్లో

పంటలు బీమా నమోదులో వెంటాడుతున్న సమస్య

ఆన్‌లైన్‌లో నమోదుకాని జాయింట్‌ ఎల్‌పీఎంలు

ఈనెల 15 వరకూ బీమా నమోదుకు అవకాశం

గంట్యాడ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి పసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకం నమోదుకు సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు చేసే సమయంలో చాలా ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో రైతులు సీఎస్‌సీ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రధానంగా ఆన్‌లైన్‌లో భూమి వివరాలు నమోదు చేసే సమయంలో ఇబ్బంది తలెత్తుతోంది. మరోవైపు రీసర్వే జరిగే గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పీఎంలను ఆన్‌లైన్‌ తీసుకోవడం లేదు. దీంతో సంబంధిత రైతులు పంటలను బీమా చేసుకోలేని పరిస్ధితి కన్పిస్తోంది. ఇటువంటి జాయింట్‌ ఎల్‌పీఎంలు జిల్లా వ్యాప్తంగా లక్ష వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఎల్‌నినో ప్రభావంతో ఏడాది వర్షాలు కురవలేదు. వేసుకున్న వరి నారు ఎండిపోతోంది. ముమ్మరంగా నాట్లు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. చెరువుల్లో చుక్కనీరులేదు. ఈ నేపథ్యంలో పంటలపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. ఈ తరుణంలో పంటల బీమా పథకాన్ని వినియోగించుకోవాలని రైతులు భావిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. ప్రతి రైతు కామన్‌ సర్వీసు సెంటరు(సీఎస్‌సీ)లో బీమాకు ప్రీమియం చెల్లించుకోవాల్సి ఉంది. రైతులు క్రాప్‌ సర్టిఫికెట్‌, బ్యాంకు బుక్‌, 1బీ జిరాక్స్‌తోపాటు ఆధార్‌ నెంబరు తీసుకువెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. జిల్లాలో చాలా మంది రైతులు వరి పంటకే ఆన్‌లైన్‌ చేసుకుంటున్నారు. ముందుగా రైతు వివరాల నమోదుకు ఆన్‌లైన్‌లో వేగంగా తీసుకున్నా?క్రాప్‌ వివరాలు, సర్వే నెంబరు ఎంటర్‌ చేసిన తరువాత సర్వర్‌ సమస్య వస్తోంది. అక్కడ నుంచి దరఖాస్తు ముందుకు కదలడం లేదు.

- వాతావరణ ఆధారిత పంటలైన వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటి పంటల బీమాకు శనివారం వరకూ అవకాశం కల్పించారు. వరి, మొక్కజొన్న, కందులు, మిరప, సజ్జలు, కొర్ర వంటి పంటల బీమాకు ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వర్‌ సమస్య, జాయింట్‌ ఎల్‌పీఎంల సమస్యలను పరిష్కారించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 02 , 2026 | 07:56 AM