Separate 'rate' treatment సెప‘రేటు’ వైద్యం
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:39 PM
Separate 'rate' treatment వైద్యులు నాడి పట్టుకోవడం మానేశారు.. స్కెత స్కోప్‌ను గుండెపై ఆనించడం మరిచిపోయినట్లుంది. రోగి చెప్పే బాధలను బట్టి ఎక్షరేలు, స్కానింగ్‌లు, రక్త పరీక్షలు చేయాలని చెబుతున్నారు. సాధారణ జ్వరానికి కూడా ఏవేవో టెస్టులు రాసేస్తున్నారు. వీటిని బట్టి ఐదు నుంచి పది రకాల మాత్రలు, టానిక్‌లు అంటగడుతున్నారు.
సెప‘రేటు’ వైద్యం
నాడి పట్టుకోని వైద్యుడు
ధర్మామీటరు లేకుండా శరీర ఉష్ణోగ్రత నమోదు
ఆసుపత్రికి వస్తే రకరకాల పరీక్షలు
సాధారణ జ్వరానికీ రూ.వెయ్యి దాటుతున్న ఖర్చు
ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్షంతో ప్రైవేటు దోపిడీ
- వేపాడకు చెందిన ఓ వ్యక్తి ఒంట్లో నలతగా ఉందని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఎత్తు, బరువు, బీపీ, అప్పటికప్పుడు చేసే షుగర్ టెస్టు వివరాలతో చీటీ రాసి వైద్యుని వద్దకు పంపించారు. మణికట్టు(నాడి) పట్టుకోకుండానే వైద్యుడు ఎంటి సమస్య అని అడిగారు. తనకున్న బాధలను చెప్పుకోగా ఆ వైద్యుడు పెన్ను ప్రిస్ర్కిప్సన్ చీటీపై రాసుకుంటూ వెళ్లారు. ఆ పరీక్షలు ఈపరీక్షలని అదే ఆసుపత్రిలో మరికొన్ని టెస్టులు రాశారు. వీటికి ఓ రూ.1200 వరకు వసూలు చేశారు. ఆ టెస్టుల్లో ఏముందో చెప్పకుండానే ఓ ఐదారు రకాల మందులు రాసిచ్చేశారు. ఇవి వాడిన తరువాత కూడా తగ్గకపోతే మళ్లీ రండిని చెప్పి పంపించేశారు. ఇదే ఆసుపత్రిలో ఉన్న మందుల దుకాణంలో కొనుగోలు చేసిన మందులకు రూ.1000 వరకు అయింది. అసలు విషయం ఏమిటంటే.. తగినంత నీరు తాగక నీరసంగా అనిపించడంతో ఆయన ముందు జాగ్రత్తగా చూపించుకొనేందుకు వెళ్లాడంతే. రూ.2,200 ఖర్చుకావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన ఆవేదన చెందాడు.
వైద్యులు నాడి పట్టుకోవడం మానేశారు.. స్కెత స్కోప్‌ను గుండెపై ఆనించడం మరిచిపోయినట్లుంది. రోగి చెప్పే బాధలను బట్టి ఎక్షరేలు, స్కానింగ్‌లు, రక్త పరీక్షలు చేయాలని చెబుతున్నారు. సాధారణ జ్వరానికి కూడా ఏవేవో టెస్టులు రాసేస్తున్నారు. వీటిని బట్టి ఐదు నుంచి పది రకాల మాత్రలు, టానిక్‌లు అంటగడుతున్నారు.
శృంగవరపుకోట, మార్చి 18(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ఏ ప్రైవేటు ఆసుపత్రి మెట్లెక్కినా సాధారణ జ్వరానికి కూడా డాక్టర్ ఫీజుతో రూ.1000 దాటుతోంది. ఇతర ఏదైనా వ్యాధితో బాధ పడుతూ వెళ్తే కనీసం రూ.5వేలకు బిల్లు తగ్గడం లేదు. పలు ఆసుపత్రుల్లో ఉష్ణోగ్రత కొలిచే పరికరం ఉండడం లేదు. అలాగే నాలుగైదు రకాల మందులు ఇచ్చేస్తుండడంతో ఏదో ఒక రకం మాత్రలకు సమస్య తగ్గుతుందన్నది వైద్యంపై అవగాహన ఉన్న వ్యక్తి చెబుతున్న మాట. మిగిలిన నాలుగు రకాల మాత్రలు అవసరం లేకపోయినా వాడాల్సి వస్తోంది. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ వ్యాపార దృక్పథంలో నడుచుకుంటున్న వైద్యుల చెవికెక్కడం లేదు.
సంపాదనే ధ్యేయంగా..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వారు దోపిడీకి తెరలేపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొంత మంది వైద్యులు సొంతంగా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లను నడుపుతున్నారు. మరికొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను మభ్యపెడుతున్నారు. ఇక్కడ పరీక్షలు చేసేందుకు సరైన పరికరాలు లేనందున తాము నడిపే, పని చేసే ఆసుపత్రులకు పలానా టైంలో వస్తే ఉంటామని సమాచారం ఇస్తున్నారు. ఇదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కొంత మంది సిబ్బందితో రోగికి ఆ ఆసుపత్రుల పేర్లు చెప్పేలా సూచిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా నజరానాలు అందిస్తున్నారు. ఈవిధంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను ప్రైవేటు వైపు తిప్పుకుంటున్నారు.
ల్యాబ్‌లు, దుకాణాలూ వారివే..
ప్రతి ప్రైవేటు ఆసుపత్రి లాబ్‌లు, మెడికల్ షాపులను సొంతంగా నడుపుకుంటున్నాయి. ఈ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఇక్కడే వారు రాసిచ్చిన టెస్టులను చేయించుకోవాలి. మందులను ఇక్కడే కొనుగోలు చేయాలి. ఇక్కడ కాకుండా మరోచోట మందుల కొనుగోలుకు వెళ్లినప్పటికీ వీరు రాసే కంపెనీల మందులు అక్కడ దొరకవు. వేరే కంపెనీవి దొరికినా అవి అసలైనవి కావంటూ చెబుతున్నారు. టెస్టుల విషయంలోనూ అంతే. వేరే డాక్టరు రాసే టెస్టుల రిపోర్టులను చూడరు. తిరిగి కొత్తగా చేయించుకొని రావాలని చెబుతున్నారు. అవసరం లేని టెస్టులు, అనవరమైన మందులు కట్టబెడుతున్నారు.
అవసరం లేకపోయినా టెస్టులు
అవసరం లేని టెస్టులతో డబ్బులను మాత్రమే కోల్పోతున్నారు. అనవసరమైన మందులను వాడి మరికొన్ని రోగాలను అదనంగా తెచ్చుకుంటున్నారు. కొన్ని మందుల వాడకంతో వేర్వేరు రోగాలు వస్తున్నాయని ప్రపంచ, భారతీయ ఆరోగ్య సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా కిడ్నిలపై ప్రభావం చూపుతున్నాయని ప్రముఖ వైద్యుల నుంచి వినిపిస్తోంది.
ఆరోగ్యశ్రీ వర్తింపునకూ కొర్రీలు
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది. రోగికి అవసరమైన వైద్యం ఆరోగ్యశ్రీలో ఉన్నప్పటికీ చెప్పడం లేదు. రోగి బంధువులు తెలుసుకొని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీలో నమోదుకు అలస్యం అవుతుందని, అంతవరకు ఆగితే రోగి ప్రాణానికి ముప్పని భయపెడుతున్నారు. రోగి బంధువులు మరీగట్టిగా పట్టుపడితే ఆరోగ్యశ్రీ ఆన్‌లైన్ జరిగే వరకు డబ్బులు భరించాలని చెబుతున్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తుండడంతో సామాన్యులను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.