హత్యాయత్నం కేసులో శిక్ష ఖరారు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:07 AM
భోగాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన హత్యాయత్నం కేసులో పెదకవులవాడకు చెందిన గాలి అప్పన్నకు ఐదేళ్ల కారాగార శిక్ష, రూ.55వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి కె.విజయకల్యాణి శనివారం తీర్పు వెల్లడించినట్టు విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
భోగాపురం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): భోగాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన హత్యాయత్నం కేసులో పెదకవులవాడకు చెందిన గాలి అప్పన్నకు ఐదేళ్ల కారాగార శిక్ష, రూ.55వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి కె.విజయకల్యాణి శనివారం తీర్పు వెల్లడించినట్టు విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పెదకవుల వాడలో నివాసం ఉంటున్న ఎరుసు రాము కిరాణా షాపు నడుపుతుండేవాడు. 2018 సెప్టెంబరు 18న అదే గ్రామానికి చెందిన గాలి అప్పన్న అతని కిరాణా షాపు వద్దకు వచ్చాడు. దీంతో రాము.. అప్పన్నను బాకీ డబ్బులు అడిగాడు. దీంతో రామును అప్పన్న కత్తితో దాడి చేసి, గాయపర్చాడు. చికిత్స నిమిత్తం భోగాపురం సీహెచ్‌సీకి, అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఎస్‌ఐ హెచ్.ఉపేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అనంతరం వచ్చిన ఎస్‌ఐ పి.రామకృష్ణ కేసు దర్యాప్తు కొనసాగించి.. నిందితుడుపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. దీనికి సంబంధించి నేరారోపణలు రుజువు కావడంతో గాలి అప్పన్నకు న్యాయస్థానం జరిమానా, శిక్ష ఖరారు చేసిందని ఎస్పీ తెలిపారు.