ITDA 29న సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:14 AM
Seethampeta ITDA Governing Body Meeting on 29th సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఈనెల 29న 78వ పాలకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లకు ఆహ్వానాలు పంపారు.
సీతంపేట, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఈనెల 29న 78వ పాలకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లకు ఆహ్వానాలు పంపారు. వాస్తవంగా సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించి సుమారు నాలుగేళ్లు కావస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022, జనవరి నెలలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అదే ఏడాది అప్పటి ప్రభుత్వం అసంబద్ధంగా జిల్లాల విభజన చేపట్టింది. దీంతో సీతంపేట ఐటీడీఏ పార్వతీ పురం మన్యంజిల్లా పరిధిలోకి వెళ్లింది. 20 సబ్‌ప్లాన్ మండలాలు కాస్త 16 శ్రీకాకుళం జిల్లాలోను, 4 మండలాలు మన్యం జిల్లాలోను ఉన్నాయి. అయితే సీతంపేట ఐటీడీఏకు చైర్మన్‌గా ఎవరు ఉంటారనే దానిపై స్పష్టత లేకపోవడంతో గత నాలుగేళ్లుగా పాలకవర్గ సమావేశాలు జరపలేదు. సీతంపేట ఐటీడీఏకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పినా.. స్పష్టమైన ఆదేశాలు రాలేదు. కాగా ఈ నెల 29న జరిగే సమావేశానికి ఇరు జిల్లాల కలెక్టర్లు వస్తారా? లేక మన్యం కలెక్టర్ మాత్రమే హాజర వుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఐటీడీఏ ఏ జిల్లా పరిధిలో ఉంటే ఆ జిల్లా కలెక్టరే ఐటీడీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేస్తూ ఇటీవలే సీతంపేట ఐటీడీఏకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.