రేపే రెండో విడత పల్లెపోరు
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:26 AM
Second Phase of Gram Panchayat Elections Tomorrow జిల్లాలోని రెండో విడత పంచాయతీ పోరుకు యం త్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల 29న పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది.
పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
పాలకొండ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండో విడత పంచాయతీ పోరుకు యం త్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల 29న పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 20వ వరకు నామినేషన్లు స్వీకరణ, 21న పరిశీలన చేపట్టారు. 24న నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. కాగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలు, 1274 వార్డులు ఉన్నాయి. వీటిల్లో 32 పంచాయతీలు, 555 వార్డులు ఏక గ్రీవమయ్యాయి. మిగిలిన 114 పంచాయతీల్లో సర్పంచ్‌లకు, 719 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్‌లకు 285 మంది, వార్డు సభ్యులకు 1542 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడతలో మొత్తం 172951 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 84,119 మంది, మహిళలు 88,818 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 2,981 మంది సిబ్బందిని నియమించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇకపోతే ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా శుక్రవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాలు కిటకిటలాడాయి.
ప్రచారానికి తెర...ప్రలోభాలకు ఎర
పాలకొండ నియోజకవర్గంలో రెండో విడత పల్లె పోరుకు సంబంధించి ప్రచారానికి తెర పడింది. శుక్రవారం సాయంత్రానికి గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. ఎక్కడికక్కడే ప్రచార రథాలు నిలిచిపోయాయి. అయితే పోలింగ్‌కు మరో 48 గంటల సమయమే ఉండడంతో కొన్నిచోట్ల ప్రలోభాల పర్వం మొదలైంది. పలు ప్రాంతాల్లో గట్టి పోటీ ఉండడంతో కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. నగదు, మద్యంతో పాటు ఇతర తాయిలాలు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రానుపోను చార్జీలు ఇచ్చి సుదూర ప్రాంతాల నుంచి వలస ఓటర్లను కూడా రప్పిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఎవరికి వారుగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకుని.. మందు, విందుతో హడావుడి చేస్తున్నారు. వివిధ రకాల ఆకర్షణీయ గిఫ్ట్ ప్యాక్‌లు, నిత్యవసర సరుకులు, గృహోపకరణాలను ఎరగా వేసున్నారు.
ఓటేస్తారో.. లేదో?
రెండో విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో పాలకొండ నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లోని పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రచారానికి గడువు ముగియడంతో ఓవైపు పలకరింపులు, హామీలు, బుజ్జగింపులు.. మరోవైపు తాయిలాలతో హడావుడి చేస్తున్నారు. ఈ నెల 29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రహస్యంగా ఎవరికి వారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. పెద్దలు కనిపిస్తే ప్రత్యేక మర్యాదలు, యువతకు ఆత్మీయ పలకరింపులు, మహిళలకు ప్రత్యేక హామీలు ఇస్తున్నారు. ఆప్యాయతలు కురిపిస్తూ.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇలా ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డబ్బు ఇచ్చినా.. ఓటర్లు తమకే ఓటు వేస్తారో? లేదోనని కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తమ అనుచరులకు ఖర్చుల కోసం కొంత సొమ్ము ఇచ్చారు. అయితే ఈ మొత్తం సొమ్ము నిజంగా ఓటర్లకు చేరుతుందా..? మధ్యలోనే చేతులు మారుతుందా..? అన్న సందేహాలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో అనుచరులు ఏం చేస్తున్నారు..? ఓటర్లు స్పందన ఎలా ఉందనేదానిపై ఆరా తీస్తున్నారు. మొత్తంగా పల్లెల్లో ఎన్నికల సందడి ఆసక్తికరంగా మారింది.