Seasonal Fevers సీజనల్ జ్వరాలే.. భయపడొద్దు
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:26 AM
Seasonal Fevers – Don't Panic! కురుపాం గురుకులంలో విద్యార్థినులు సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నారని.. మరో రెండు రోజుల్లో తగ్గిపోతాయని.. ఎవరూ భయపడొద్దని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ ఆర్.వెంకటరమణ అన్నారు. శనివారం విజయవాడ నుంచి వచ్చిన ఆయన కురుపాం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ముందుగా విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగా తెలుసుకున్నారు.
కురుపాం గురుకులం పరిశీలన
కురుపాం, నవంబరు7(ఆంధ్రజ్యోతి): కురుపాం గురుకులంలో విద్యార్థినులు సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నారని.. మరో రెండు రోజుల్లో తగ్గిపోతాయని.. ఎవరూ భయపడొద్దని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ ఆర్.వెంకటరమణ అన్నారు. శనివారం విజయవాడ నుంచి వచ్చిన ఆయన కురుపాం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ముందుగా విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగా తెలుసుకున్నారు. వాతావరణ మార్పుల వల్ల బాలికలు సీజనల్ జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారని, వాటివల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఆయన తెలిపారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం పాఠశాలలో డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థినులకు ఏ విధంగా వైద్య సేవలు అందించాలో సూచించారు. విద్యార్థినులకు వేడి వేడి ఆహారం, సురక్షిత నీరు అందించాలని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. 24 గంటల పాటు వైద్య బృందం పాఠశాలలో ఉంటూ వైద్య సేవలందిస్తారని వెల్లడించారు. జ్వరం, ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న బాలికలను తక్షణమే కురుపాం సీహెచ్‌సీకి తరలించాలని ఆదేశించారు. వారికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. విజయవాడ నుంచి వచ్చిన మలేరియా ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పాఠశాలలోనే ఉండి విద్యార్థినులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే జిల్లాస్థాయి వైద్య నిపుణుల బృందం పాఠశాలలోనే ఉన్నట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు వైద్య బృందాలు ఇక్కడ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారన్నారు. ఈ పరిశీలనలో డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డీఎంవో సూర్యనారాయణ, వైద్యులు ఉన్నారు.
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: ఐటీడీఏ పీవో
పార్వతీపురం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వస్తున్నవి సాధారణ వైరల్ జ్వరాలేనని, నీరు, ఆహారం కలుషితం కాలేదని ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దన్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐటీడీఏ పరిధిలోని 14,888 మంది విద్యార్థులకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ.. మెరుగైన వైద్య సేవలు అంది స్తున్నామని తెలిపారు. నీరు, ఆహార నమూనాల పరీక్షల్లో ఎలాంటి కాలుష్యం గుర్తించలేదని వెల్లడించారు. కురుపాం గురుకులంలో రూ.2.47 కోట్లతో నిర్మిస్తున్న నూతన డార్మెటరీ పనులు తుది దశకు చేరుకున్నాయని, మరో రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.