‘Larva Hunt’ ‘లార్వా వేట’తో సీజనల్ వ్యాధులు దూరం
ABN , Publish Date - May 13 , 2026 | 11:49 PM
Seasonal Diseases Kept Away with ‘Larva Hunt’ Campaign సీజనల్ వ్యాధుల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ‘లార్వా వేట’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం టీకే జమ్ము పంచాయతీ గోర్లి గ్రామంలో పర్యటించారు.
జియ్యమ్మవలస, మే13(ఆంధ్రజ్యోతి): సీజనల్ వ్యాధుల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ‘లార్వా వేట’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం టీకే జమ్ము పంచాయతీ గోర్లి గ్రామంలో పర్యటించారు. ‘ గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మలేరియా బాధితులు ఎక్కువగా ఉండేవారు.. ఇప్పుడు అటువంటి వారి సంఖ్య బాగా తగ్గింది. దానికి కారణం గత ఆరు నెలలుగా ‘మా ఊరికి మలేరియా వచ్చింది.. ఫ్రైడే డ్రైడే’ వంటి కార్యక్రమాలు నిర్వహించడమే.. ప్రస్తుతం అక్కడక్కడా నమోదవుతున్న కేసుల నియంత్రణకు ‘లార్వా వేట ’ ప్రారంభించాం. నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాను గుర్తించి.. నిర్మూలించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీనివల్ల సీజనల్ వ్యాధులను దూరం చేయొచ్చు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే ఎంపీడీవోలకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చాం. వారు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ’ అని కలెక్టర్ తెలిపారు. అనంతరం గ్రామంలో ఆయన ‘వాగు పండుగ’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న వాగులను గుర్తించి, వాటిల్లో లార్వా నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. అనంతరం ఆయన బీజే పురం గ్రామం చేరుకున్నారు. బాల్య వివాహాలు అరికట్టాలని సూచించారు. కనీసం డిగ్రీ పాసై, ఉద్యోగం వచ్చిన తరువాతే వివాహం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, ఎన్‌సీడీ అధికారి టి.జగన్మోహనరావు, డీఐవో వై.విజయ్‌మోహన్, డీపీవో రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.