Scrutiny of Nominations పురాల్లో నామినేషన్ల పరిశీలన పూర్తి
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:44 PM
Scrutiny of Nominations Completed in Municipalities మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మరో ఘట్టం ముగిసింది. ఆదివారంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియగా.. సోమవారం వాటి పరిశీలన పూర్తయింది. సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు సంబంధించి 198 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, 15 మంది చైర్‌పర్సన్ అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 21న నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. పాలకొండ నగర పంచాయతీలో దాఖలైన 124 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు కమిషనర్ నూకరాజు తెలిపారు.
వాటిని తిరస్కరించిన అధికారులు
పార్వతీపురం టౌన్/సాలూరు/పాలకొండ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మరో ఘట్టం ముగిసింది. ఆదివారంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియగా.. సోమవారం వాటి పరిశీలన పూర్తయింది. సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు సంబంధించి 198 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, 15 మంది చైర్‌పర్సన్ అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 21న నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. పాలకొండ నగర పంచాయతీలో దాఖలైన 124 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు కమిషనర్ నూకరాజు తెలిపారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా 120 మంది, చైర్‌పర్సన్ అభ్యర్థులుగా నలుగురు నామినేషన్లు వేసినట్లు చెప్పారు. నామినేషన్ పత్రాలన్నీ పారదర్శకంగా పరిశీలించామన్నారు. వాటిల్లో ఎటువంటి లోపాలు లేవన్నారు. ఉపసంహరణ ప్రక్రియ తర్వాత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పార్వతీపురం మున్సిపాల్టీలో 36 వార్డులకు సంబంధించి 196 మంది అభ్యర్థులు కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేశారు. చైర్‌పర్సన్ అభ్యర్థులుగా తొమ్మిది మంది నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ల పరిశీలన అనంతరం 11 మంది డబుల్ ఎంట్రీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 185 మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా ఉన్నట్లు మున్సిపల్ ఎన్నికల అధికారి రామ్ గోపాల్ స్పష్టం చేశారు. అదేవిధంగా చైర్‌పర్సన్ అభ్యర్థుల నామినేషన్లలో రెండు డబుల్ ఎంట్రీలను గుర్తించి వాటిని తిరస్కరించారు. దీంతో ఏడుగురే బరిలో ఉన్నట్లు వెల్లడించారు.
ఎవరికి వారే.. నామినేషన్లు.. కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు
పార్వతీపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాల్లో కూటమి పార్టీల మధ్య కౌన్సిలర్ సీట్లు సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. సాలూరులో 16 కౌన్సిలర్ స్థానాలను జనసేన డిమాండ్ చేస్తోంది. అయితే ఐదు లేదా ఆరు కౌన్సిలర్స్ స్థానాలు మాత్రమే టీడీపీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా బీజేపీఒక స్థానం కేటా యిస్తున్నట్టు తెలిసింది. కానీ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. సాలూరులో చైర్‌పర్సన్ సీటు జనసేనకు కేటాయించినప్పటికీ అదే పార్టీ నుంచి ఖరారైన అభ్యర్థితో పాటు మరొకరు ఆ స్థానం కోసం నామినేషన్ వేశారు. ఇక టీడీపీ నుంచి ఐదుగురు నామినేషన్లు వేశారు. పార్వతీపురం పట్టణంలో కూడా కూటమి పార్టీల మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా పార్వతీపురం మున్సిపాల్టీని టీడీపీకి కేటాయించినప్పటికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు సతీమణి జ్యోతి బీజేపీ తరఫున, కోడలు దీప్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చైర్‌పర్సన్ స్థానం కోసం నామినేషన్ వేయడం చర్చనీయాంశమవుతోంది. జనసేన నుంచి కూడా ఒకరు నామినేషన్ వేశారు.