Share News

Heatwave! బాబోయ్‌ ఎండలు

ABN , Publish Date - May 15 , 2026 | 11:50 PM

Scorching Heatwave! జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజూ 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లోనూ వాతావరణంలో వేడి ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 Heatwave! బాబోయ్‌ ఎండలు
మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా పాలకొండ ప్రధాన రహదారి

  • అల్లాడుతున్న ప్రజలు

పాలకొండ, మే 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజూ 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లోనూ వాతావరణంలో వేడి ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఎండ ఠారెత్తించింది. ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భానుడు తన ప్రతాపం చూపాడు. దీంతో జిల్లావాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, కొమరాడలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్లు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. వేసవి తాపాన్ని మూగ జీవాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత కాపరులు మూగజీవాలను చెట్లుకిందకు తరలించి సేదతీరేలా చూస్తున్నారు. మరోవైపు వన్య ప్రాణులు కూడా తాగునీటి కోసం కటకటలాడుతున్నాయి. మైదాన ప్రాంతాలకు తరలివచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఉపాధి వేతనదారులు కూడా వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు. కొందరు చెట్ల కిందకు చేరుతున్నారు. సకాలంలో ఐరీస్‌ పడక వారు ఎండలో నిరీక్షించాల్సి వస్తుంది. ఈ కోవలోనే గురువారం భాసూరులో ఓ వేతనదారుడు మృత్యువాత పడ్డాడు. మొత్తంగా ఎండ ధాటికి మన్యం వాసులు విలవిల్లాడిపోతున్నారు.

Updated Date - May 15 , 2026 | 11:50 PM