Scorching Heat మన్యంలో మండుటెండలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:49 PM
Scorching Heat in the Agency Areas జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆర్నాబ్ తుఫాన్ తర్వాత .. మళ్లీ వాతావరణం వేడెక్కింది. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి
పాలకొండ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆర్నాబ్ తుఫాన్ తర్వాత .. మళ్లీ వాతావరణం వేడెక్కింది. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఎండ, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం 11 గంటల్లోపేల పనులు ముగించుకుని ఇళ్లకు చేరుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మళ్లీ బయటకు వస్తున్నారు. అయితే మధ్యాహ్నం వేళల్లో ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు వ్యవసాయ కూలీలు ఖరీఫ్ కాలంలో ఒక్కపూటే పనిచేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల్లోపే పని ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నారు. తుపాను తర్వాత జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల పరిధిలోని శివారు ప్రాంత రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు మళ్లించలేకపోతున్నారు. ప్రధానంగా తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని ఓని గ్రామం వద్ద భారీ గండి పడడంతో శివారు భూములకు చుక్కనీరు అందడం లేదు. వరుణుడు కరుణిస్తే గాని పంట భూములకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కాగా ఇప్పటికే అందుబాటులో ఉన్న వాగులు, గెడ్డల్లోని నీటిని పంట పొలాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.