మండుతున్న ఎండలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:08 AM
జిల్లాలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. గత వారం రోజులుగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండలు ఠారెత్తిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఎండుతున్న పంటలు
- జిల్లాలో వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు
- పంటలను కాపాడుకునేందుకు రైతుల పాట్లు
- సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం
- శివారు భూములకు చేరని నీరు
పాలకొండ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. గత వారం రోజులుగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండలు ఠారెత్తిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నిన్నమొన్నటి వరకు వర్షాభావంతో నాట్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్న రైతులు పదిహేను రోజుల కిందట జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు కొండవాగులు, గెడ్డలు, సెలయేర్లు ద్వారా నీరు రావడంతో వరి ఉభాలను పూర్తి చేశారు. కొంతమంది రైతులు అప్పటికే నారు ఎండిపోవడంతో సాగు చేపట్టలేదు. అయితే గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పంట పొలాల్లో ఉన్న కొద్ది నీరు పూర్తిగా అడుగంటుతుంది. ఇప్పటికే ఎత్తు ప్రాంతంలో ఉన్న పొలాలు బీటలు వారాయి. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీ వ్రతను తట్టుకోలేక పనులు చేయని పరిస్థితి నెలకొంది. ఎండలు వేసవిని తలపిస్తుండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం...
జిల్లా వ్యాప్తంగా రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రైతులు వాగులు, గెడ్డలు, చెరువుల్లో ఉన్న కొద్దోగొప్పో నీటిని పంటల పొలాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎకరం పొలానికి సాగునీరు అందించేందుకు ఇంజిన్, డీజిల్ ఖర్చుతో పాటు పైపులైన్ల ఏర్పాటు, కూలీలకు సుమారు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఇదే విధంగా ఎండలు ఉంటే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.
శివారు భూములకు అందని సాగునీరు..
జిల్లా వ్యాప్తంగా వివిధ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదు. వెంగళరాయసాగర్, జంఝావతి, ఒట్టిగెడ్డ, తోటపల్లి తదితర ప్రాజెక్టులు ద్వారా సుమారు 75 వేల హెక్టార్లకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని శివారు భూములకు ఇప్పటికీ చుక్కనీరు అందడం లేదు. తోటపల్లి ఎడమ ప్రఽధాన కాలువ పరిధిలో ఉన్న 8వ బ్రాంచి కాలువపై పాలకొండ మండలంలో 18 గ్రామాల రైతులు ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఆయా గ్రామాలకు ఇప్పటికీ ఈ కాలువ ద్వారా సాగునీరు రాలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో పాటు కొండవాగులు, గెడ్డల ద్వారా వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకొనే రైతులు నాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు ఎండలతో ఈ పంటలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.