Scorching Agency Region మండిన మన్యం
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:18 AM
Scorching Agency Region జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి. అధిక వేడి, ఉక్కపోతకు చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అధిక వేడి, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి
నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం
పాలకొండ, జూన్7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి. అధిక వేడి, ఉక్కపోతకు చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రధాన రహదారులు, కూడళ్లు మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారాయి. జిల్లావాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. గ్రామీణ ప్రాంతవాసులు, మూగజీవాలు చెట్లు కిందకు చేరుతుండగా.. యువత నదులు, చెరువులు, నేలబావుల్లో స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వచ్చినవారు మాత్రం ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. జిల్లాలో మరో మూడు రోజుల పాటు ఎండలు అధికంగానే ఉండనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
నేటి నుంచి మృగశిర కార్తె
రోహిణి కార్తె ప్రభావంతో గత 15 రోజుల పాటు మన్యం మండింది. అయితే నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ఎండ తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపించినా ఉక్కపోత మాత్రం అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రజలు మరింత టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అడపాదడపా వర్షాలు కురవడంతో రైతులు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులను పూర్తి చేసుకుని.. నారుమడులను సిద్ధం చేస్తున్నారు. ఎద పద్ధతిలో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృగశిరకార్తెలో కూడా విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాగునీరు అందుబాటులో ఉండడంతో రైతులు విత్తనాలు జల్లేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
జిల్లాలో మరో ఐదు రోజుల పాటు 41 నుంచి 50 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసరమైతే గాని బయటకు రాకూడదన్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పల్లెవాసులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.