ఆత్మహత్యలు వద్దు.. బతికి సాధిద్దాం
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:20 AM
జిల్లాలో కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
- అందరికీ కష్టాలుంటాయ్
- వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి
- క్షణిక్షావేశానికి లోనుకావద్దు
- పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటున్న నిపుణులు
- కొత్తూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సవర పూజ అనే విద్యార్థిని ఈ ఏడాది జూలై 31న ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈమెది సీతంపేట మండలం దేవనాపురం పంచాయతీ లక్కిగూడ గ్రామం. కుమార్తె ఆత్మహత్య చేసుకోవడాన్ని తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
-తాజాగా, మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి సవర అర్పిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల వసతి గృహంలోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇంత చిన్న వయసులో అర్పిత్ ఆత్మహత్య చేసుకోవాల్సిన కారణాలు ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది.
పార్వతీపురం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చదువులో రాణించలేదని, ప్రేమ విఫలమైందని, ఉద్యోగం రాలేదని, కుటుంబ కలహాలు..ఇలా ఏదో ఒక కారణంతో మనస్తాపానికి గురై క్షణికావే శంతో బలవన్మరణాలకు పాల్పడి కన్నవారికి తీరని శోకం మిగులుస్తున్నారు. బంగారు భవిష్యత్‌ను చేజేతులా పోగొట్టుకుంటున్నారు.
కష్టాలు సహజమే..
ప్రతిఒక్కరి జీవితంలోనూ కష్టాలు, ఆత్మనూన్యత, ఒత్తిడి, నిస్పృహ ఇవన్నీ సహజమే. కానీ, వాటిని అధిగమించి ముందుకు సాగాలి. అప్పుడు భవిష్యత్ బంగారుమయం అవుతుంది. తల్లిదండ్రులకు ఆనందం పంచినవారవుతాము. కానీ, కొంతమంది విద్యార్థులు తమకు ఎలాంటి సమస్య వచ్చినా స్నేహితులు, ఉపాధ్యాయులు, చివరకు తల్లిదండ్రులు, తోబుట్టినవారితో కూడా చెప్పేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారు సమస్యలను లోలోపల దాచుకుంటూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ముభావంగా ఉండడం, ఎవరితోనూ కలవడానికి ఇష్టపడకపోవడం, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తుండడం చేస్తూ మనసులోనే కుమిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొద్దిసేపు ఆలోచనలను మళ్లిస్తే ఆత్మహత్యల ఊసే ఉండదని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారికి తరచూగా కౌన్సెలింగ్ ఇస్తే ప్రయాజనం ఉంటుందని చెబుతున్నారు. విద్యార్థులతో ఆటలు ఆడించాలని, వ్యాయామం చేయించాలని, గ్రంథాలయాలను ఎక్కువగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులు ఏదైనా సమస్యలతో ఒత్తిడికి గురైతే వారికి ధైర్యం చెప్పాలి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. జీవితం చాలా విలువైనందని, దేన్నేనా బతికి సాధించుకోవాలన్న మాటలు వారికి నూరుపోస్తుండాలి. పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని బహిర్గత పరిచి, ధైర్యంగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యాలపై ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిసారించాలి.