Sarpanch posts for Rs 2.80 crore! సర్పంచ్ పదవులు రూ.2.80కోట్లు!
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:24 AM
Sarpanch posts for Rs 2.80 crore! భోగాపురం మండలంలోని రెండు పంచాయతీల సర్పంచు పదవులు రూ.కోట్ల రూపాయలకు ఏకగ్రీవం అయిన విషయం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. బైరెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ పదవిని రూ.1,50,00,000కు, ముంజేరు సర్పంచ్ పదవిని రూ.1,30,00,000కు కైవసం చేసుకునేందుకు ఇద్దరు ఆశావహులతో అంగీకరం కుదిరినట్లు సమాచారం. మరిన్ని పంచాయతీల్లోనూ వేలం పాటలు జరుగుతున్నట్లు తెలిసింది.
సర్పంచ్ పదవులు
రూ.2.80కోట్లు!
బైరెడ్డిపాలెం, ముంజేరు పంచాయతీలు ఏకగ్రీవం?
తాజాగా గ్రామస్థుల నిర్ణయం
ఎవరెక్కువ ఇస్తే వారిదే పదవి
మరిన్ని పంచాయతీల్లోనూ వేలం పాటలు
భోగాపురం మండలంలోని రెండు పంచాయతీల సర్పంచు పదవులు రూ.కోట్ల రూపాయలకు ఏకగ్రీవం అయిన విషయం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. బైరెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ పదవిని రూ.1,50,00,000కు, ముంజేరు సర్పంచ్ పదవిని రూ.1,30,00,000కు కైవసం చేసుకునేందుకు ఇద్దరు ఆశావహులతో అంగీకరం కుదిరినట్లు సమాచారం. మరిన్ని పంచాయతీల్లోనూ వేలం పాటలు జరుగుతున్నట్లు తెలిసింది.
భోగాపురం, నవంబరు16(ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. అధిక పంచాయతీలు ఈ బాట పట్టాయి. అయితే డబ్బే ప్రధాన పాత్ర పోషించడం విశేషం. సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి ఔత్సాహికులు డబ్బు అస్త్రంతో పావులు కదుపుతున్నారు. గ్రామ అభివృద్ధికి డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలతో పాటు ధనబలం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎవరెక్కువ ఇస్తే వారే సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భోగాపురం మండలంలో పలు పంచాయతీల్లో అభివృద్ధి పేరుతో వేలం పాటలు సైతం నిర్వహిస్తూ ఏకగ్రీవాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిర్‌పోర్టు సమీప పంచాయతీలు అయిన బైరెడ్డిపాలెం, ముంజేరులో సర్పంచ్ పదవికి సంబంధించి పోటీలేకుండా గ్రామ అభివృద్ధికి గ్రామస్థులందరూ మాట్లాడుకొని ఏకగ్రీవంగా అంగీకరించినట్లు సమాచారం. ఇందుకోసం చేపట్టిన వేలంపాటలో పలువురు సర్పంచ్ ఆశావహులు పాల్గొన్నారు. అత్యధికంగా బైరెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.1,50,00,000కు, ముంజేరు సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.1,30,00,000 అంగీకరం కుదిరినట్లు సమాచారం. ఈనగదును పంచాయతీల్లో అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది.
బైరెడ్డిపాలెం పంచాయతీ ఏకగ్రీవానికి సంబంధించి నామినేషన్ గడువుకు ముందురోజు ఏకగ్రీవం పొందిన వ్యక్తి పంచాయతీకి (గ్రామపెద్దలకు) నగదు చెల్లించాలని అంగీకారం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే ముంజేరు పంచాయతీలో కూడా ఇంచుమించుగా ఇదే పద్ధతి నడిచింది. అయితే కొందరు యువత పోటీలో పాల్గొనడానికి మొగ్గు చూపుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నిక జరిగితే అందరూ ఏకతాటిపై రూ.కోటి30లక్షలకు అంగీకారం కుదుర్చుకొన్న వ్యక్తినే గెలుపించుకోవడానికి ముంజేరు పంచాయతీ ప్రజలు నిర్ణయం తీసుకొన్నారు.
ఫ బైరెడ్డిపాలెం పంచాయతీ ఏకగ్రీవం అయితే 1279 జనాభా, 1042 ఓటర్లు ఉండడంతో ప్రభుత్వం రూ.15లక్షలు నజారాన అందజేయనుంది. ముంజేరు పంచాయతీలో సుమారు 5600 జనాభా, 3428 ఓటర్లు ఉండడంతో ఏకగ్రీవం అయితే ప్రభుత్వం నుంచి రూ.25లక్షల ప్రోత్సాహం లభించనుంది. ఈ మొత్తం నిధులతో గ్రామంలో అనేక పనులు జరుగుతాయని ఈ రెండు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. అలాగే చేపలకంచేరు పంచాయతీలో సర్పంచ్ ఆశావాహులు సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకొన్నట్లు సమాచారం. ఈ మండలంలో 22 పంచాయతీలు ఉండగా చాలా వరకు పంచాయతీలు అభివృద్ధి రూపంలో అధిక మొత్తాలకు ఏకగ్రీవాలకు సన్నాహాలు చేసుకొంటున్నట్లు సమాచారం.
------------------
రూ.21 లక్షలకు పాతరేగ ఏకగ్రీవం
రామభద్రపురం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): పాతరేగ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవంగా పెద్దింటి లక్ష్మిని ఎంపిక చేసుకున్నారు. టీడీపీ మద్దతుదారైన ఈమె గ్రామంలో రామమందిర అభివృద్ధి కోసం రూ.21 లక్షలు ఇవ్వాలని గ్రామస్థులు తీర్మానించారు. ఈ పంచాయతీని బీసీ మహిళకు కేటాయించారు. పెద్దింటి లక్ష్మి భర్త పెద్దింటి పైడిపునాయుడు తెలుగుదేశం నాయకుడుగా కొనసాగుతున్నారు.
---------------------
ఏడు గ్రామాలు ఏకగ్రీవం
వేపాడ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వేపాడ మండలంలో చాలా పంచాయతీలు ఏకగ్రీవం బాట పట్టాయి. దబ్బిరాజుపేట, నల్లబిల్లి, చినగుడిపాల, బల్లంకి , జాకేరు, కృష్ణరాయుడుపేట, ఆతవ తదితర గ్రామాలు ఏకగ్రీవం కాగా పాటూరు, చామలాపల్లి, ముకుందపురం, ఓబలయ్యపాలెం, రామస్వామిపేట గ్రామాల్లో ఏకగ్రీవం కోసం చర్చలు సాగుతున్నాయిని ఆయా గ్రామాల నాయకులు, పెద్దలు తెలిపారు. దబ్బిరాజుపేట గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం కావడం విశేషం.