Share News

naminations సర్పంచులకు 675 .. వార్డు సభ్యులకు 1651

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:22 AM

Sarpanch 675 , Ward Members 1,651 జిల్లాలో మొదటి దశ పల్లెపోరులో భాగంగా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలో 226 పంచాయతీలకు సోమవారం రెండోరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచులకు 675 , వార్డు సభ్యులకు 1651 మంది పత్రాలు అందించారు.

naminations సర్పంచులకు 675 .. వార్డు సభ్యులకు 1651

  • పత్రాల స్వీకరణకు నేటితో ముగియనున్న గడువు

పార్వతీపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి దశ పల్లెపోరులో భాగంగా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలో 226 పంచాయతీలకు సోమవారం రెండోరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచులకు 675 , వార్డు సభ్యులకు 1651 మంది పత్రాలు అందించారు. సర్పంచ్‌ పదవి కోసం గుమ్మలక్ష్మీపురంలో 73, జియ్యమ్మవలస 72, కురుపాం 81, గరుగుబిల్లి 69, కొమరాడ 94, బలిజిపేట 78, పార్వతీపురం 100, సీతానగరం 108 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు గుమ్మలక్ష్మీపురంలో 113, జియ్యమ్మవలస 158, కురుపాం 120, గరుగుబిల్లి 230, కొమరాడ 269, బలిజిపేట 232, పార్వతీపురం 213, సీతానగరంలో 316 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో సర్పంచ్‌ పదవులకు 757, వార్డు సభ్యులకు 1750 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా పత్రాల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. 226 పంచాయతీలు, 2116 వార్డులకు సంబంధించి వచ్చిన నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. 21 వరకు పత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 26న మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు.

పిప్పలభద్ర ఏకగ్రీవం

జియ్యమ్మవలస, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో పిప్పలభద్ర పంచాయతీ ఏకగ్రీవమైంది. టీడీపీ మద్దతుదారు పిన్నింటి వెంకటనాయుడు రూ.10లక్షలకు సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నారు. వాస్తవంగా ఈ గ్రామం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. గత నెల 19న గ్రామస్థులు వేలం పాట నిర్వహించి.. పంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు.

రెండో విడత పల్లె పోరుకు షెడ్యూల్‌ విడుదల

పార్వతీపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు పాలకొండ నియోజకవర్గం.. భామిని, సీతంపేట, వీరఘట్టం, పాలకొండ మండలాల పరిధిలోని పంచాయతీలకు సంబంధించి ఈ నెల 18 నుంచి 20వ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న వాటిని పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైతే అభ్యర్థులు సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారి హోదాలో ఉన్న అధికారి వద్ద 22న అప్పీల్‌ చేసు కోవచ్చు. 23న అప్పీళ్లను పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 29న ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. వీలుంటే అదేరోజు ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అవసరమైతే 30న రీ పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 12:22 AM