Sankranti Festivities సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:40 PM
Sankranti Festivities ‘మన్యం’కు పండుగ కళ వచ్చేసింది. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి శోభ జిల్లా అంతటా ఉట్టి పడుతోంది. విద్యుత్ దీపాలంకరణలు, ముత్యాల ముగ్గులు, భోగి పిడకలు, హరిదాసు కీర్తనలతో పట్టణాలు, పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.
మన్యానికి సరికొత్త శోభ
నేడు భోగి
కొన్నిచోట్ల అర్ధరాత్రి నుంచే మంటలు వేసిన ప్రజలు
పార్వతీపురం/పాలకొండ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ‘మన్యం’కు పండుగ కళ వచ్చేసింది. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి శోభ జిల్లా అంతటా ఉట్టి పడుతోంది. విద్యుత్ దీపాలంకరణలు, ముత్యాల ముగ్గులు, భోగి పిడకలు, హరిదాసు కీర్తనలతో పట్టణాలు, పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. పండుగ కోసం వచ్చిన వారితో ఇళ్లు, వాకిళ్లు కళకళలాడుతున్నాయి. బుధవారం భోగితో మూడు రోజుల పండుగ వేడుకలు ప్రారంభ మవుతాయి. ఈ నేపథ్యంలో చాలాచోట్ల మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి మొదలైంది. యువకులు పెద్ద ఎత్తున కర్రలను సేకరించారు. చిన్నారులు , పెద్దలు పిడకలను మాలగా కూర్చి భోగీలో వేశారు. సూర్యాస్తమయంలోపు చిన్నారులకు పెద్ద ఎత్తున బుధవారం భోగిపండ్లు వేయనున్నారు. గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ, శనివారం ముక్కనుమను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. మరోవైపు ఉపాధి కోసం జిల్లా విడిచి వెళ్లిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారిని స్థానికులు, బంధువులు ఆత్మీయ పలకరింపులతో స్వాగతం పలుకుతున్నారు. నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు కావడంతో జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు తమ సొంతూర్లకు పయనమయ్యారు.
సాలూరులో ముందస్తుగా భోగి మంటలు
సాలూరు రూరల్: సాలూరు పట్టణంలోని పలు వీధుల్లో మంగళవారం రాత్రి భోగి మంటలు వేశారు. భోగి పండుగనుముందు రోజు రాత్రి జరుపుకోవడం సాలూరులో ఆనవాయితీగా వస్తుంది. ఇక పట్టణంలోని కామాక్షి అమ్మవారి దేవాలయంలో శాస్ర్తోక్తంగా పూజలు జరిపి భోగి మంటలు వేశారు.
కిటకిటలాడిన మార్కెట్లు
జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ నగర పంచాయతీతో పాటు మండల కేంద్రాల్లో మార్కెట్లు మంగళవారం కిటకిటలాడాయి. పెద్దల పండుగకు అవసరమైన నిత్యావసర సరుకులు, నూతన వస్ర్తాలు, పూజా సామగ్రి తదితర వాటిని కొనుగోలు చేసేందుకు పెద్దఎత్తున ప్రజలు తలివచ్చారు. మరికొందరు కూరగాయలు, మట్టి కుండలు, నాటుకోళ్లు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశన్నంటాయి. మిగిలిన రోజులతో పోల్చి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుండడంతో వినియోగ దారులు గగ్గోలు పెడుతున్నారు. మొత్తంగా ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు వస్తు సామగ్రిని కొనుగోలు చేశారు. మరోవైపు ప్రధాన రహదారులు, కూడళ్లు రద్దీగా మారడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు.