Share News

Sankranti Celebrations సంక్రాంతి సంబరం

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:22 AM

Sankranti Celebrations జిల్లావాసులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపు కున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పితృదేవతలకు పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం పుణ్యకాలంలో ఆయా కుటుంబాల పెద్దలకు నూతన వస్త్రాలు చూపించారు.

Sankranti Celebrations  సంక్రాంతి సంబరం
భక్తులతో కిటకిటలాడుతున్న రేగాలమ్మ కండి ప్రాంతం

  • జిల్లాకు ప్రత్యేక శోభ

  • వెల్లివిరిసిన సంప్రదాయాలు

  • ఉత్సాహంగా కనుమ

  • గోవులకు ప్రత్యేక పూజలు

పార్వతీపురం, జనవరి16(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపు కున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పితృదేవతలకు పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం పుణ్యకాలంలో ఆయా కుటుంబాల పెద్దలకు నూతన వస్త్రాలు చూపించారు. అనంతరం కొత్త దుస్తులు ధరించి అంతా ఉత్సాహంగా కనిపించారు. నూతన దుస్తుల్లో చిన్నారులు, యువత కేరింతలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. పిండి వంటల గుమగుమలతో పండుగ సందడిగా సాగింది. పల్లెలు, పట్టణాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. రంగవల్లులు, గొబ్బెమ్మలతో ముంగిళ్లు ఆకట్టుకున్నాయి. మొత్తంగా జిల్లాలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ప్రజలు ఆనందోత్సా హాలతో తొలి రోజు భోగి, తరువాత పెద్దల పండుగను జరుపుకున్నారు. శుక్రవారం కనుమను ఘనంగా నిర్వహించారు. చాలాచోట్ల గో పూజలను నిర్వహించారు. మరోవైపుగ్రామాల్లో జంగందేవరలు, గంగిరెద్దులతో దాసరులు సందడి చేశారు. మొత్తంగా మూడు రోజుల పాటు ‘మన్యం’ కళకళలాడింది. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లో సందడి వాతావరణం నెలకొంది.

జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస పక్షులంతా సొంతూర్లకు చేరుకోవడంతో గ్రామాలన్నీ పులకించాయి. బంధువుల రాకతో ప్రతి ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. పండుగ నేపథ్యంలో పట్టణాలు బోసిపోయాయి. జిల్లాలో ప్రధాన జంక్షన్లు వెలవెలబోయాయి. వివిధ దుకాణాలు కూడా మూతపడ్డాయి. కాగా శనివారం ముక్కనుమ జరుపుకోవడానికి జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ ముగియడంతో వలస పక్షులంతా తిరుగు ప్రయాణమయ్యారు. విశాఖ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పూణే తదితర ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు. మళ్లీ సంక్రాంతికి కలుసుకుందాం.. బైబై అంటూ ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు పయనమయ్యారు. దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో పాలకొండ, సాలూరు, పార్వతీపురం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపారు.

కిటకిటలాడిన మాంసం దుకాణాలు...

సాలూరు రూరల్‌ : కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం మాంసపు దుకాణాలు కిటకిటలాడాయి. పొట్టేళ్లు, కోడిమాంసం, చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఇక తలకాయ మాంసం, బోటీ ధరలను భారీగా పెంచేశారు. డిమాండ్‌ దృష్ట్యా చాలాచోట్ల గురువారం అర్ధరాత్రి దాటిన మటన్‌ విక్ర యాలు చేపట్టారు. జిల్లాలో దాదాపు రూ. 2.30 కోట్ల మేర మాంసాహార విక్రయాలు జరిగి ఉంటాయని ఒక అంచనా. సాలూరు మార్కెట్‌లో మాంసాహార ధరలకు రెక్కలు వచ్చాయి. బొచ్చు చేపరకం కిలో రూ. 160, బంగారుతీగె చేపరకం కిలో రూ.200 విక్రయించారు. సంక్రాంతి సందర్భంగా కొందరు గృహోపకరణాలు కొనుగోలు చేశారు. కొత్త అల్లుళ్లకు కానుకలివ్వడానికి అత్తవారు భారీగానే ఖర్చు చేశారు. జిల్లాలో రూ. 60 కోట్లకు పైబడి వస్త్రవ్యాపారం జరిగినట్టు వస్త్రవ్యాపారులు అంచనా వేస్తున్నారు . మరోవైపు మన్యంలో మద్యం అమ్మకాలు కూడా భారీగా సాగాయి.

కోడిపందేలు

సాలూరు రూరల్‌ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాలూరు మండలంలో పడమర బెల్ట్‌లోని ఒకటి, రెండు తోటల్లో కోడిపందేలు జరిగాయి. వాటిని పలువురు ఆసక్తిగా వీక్షించారు. మరోవైపు సాలూరులో గుర్రంపై పలువురు స్వారీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. సాలూరు అర్బన్‌తో పాటు గ్రామాల్లో చిన్నారులు పతంగులు ఎగురవేసి సందడి చేశారు.

ప్రభుత్వ విప్‌ ‘ఆట’విడుపు

గుమ్మలక్ష్మీపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తాడికొండ గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆమె మహిళలతో కలిసి కబడ్డీ ఆడి అందర్నీ ఉత్సాహపరిచారు. కబడ్డీ ..కబడ్డీ అంటూ కూత పెట్టి మహిళా క్రీడాకారులతో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అడ్డాకుల నరేష్‌, జడ్పీటీసీ రాధిక తదితరులు పాల్గొన్నారు.

రేగాలమ్మ కండికి పోటెత్తిన భక్తులు

గరుగుబిల్లి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): నాగూరు సమీపంలోని నాగావళి నది మధ్యలో రాళ్ల గుట్టల నడుమ ఉన్న రేగాలమ్మ గుడికి ఏటాలానే ఈ సారి కూడా భక్తులు పోటెత్తారు. దీంతో శుక్రవారం ఆ ప్రాంతం కిటకిటలాడింది. పండుగ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన వారు భారీగా తరలివచ్చి.. అక్కడున్న అమ్మవారిని దర్శించుకున్నారు. కొందరు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. దీంతో ప్రాంతం రద్దీగా మారింది. ఆహ్లాదకర ప్రాంతంలో చిన్నారులు, పెద్దలు సరదాగా గడిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్‌ చర్యలు చేపట్టారు.

నాన్నకు పాదాభివందనం

భామిని, జనవరి 16(ఆంధ్రజ్యోతి): నల్లరాయిగూడలో ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందిన బిడ్డిక బాలమ్మగొమాంగోకు గురువారం ఆయన బిడ్డలు పాదాభివందనం చేశారు. ఏటాలానే పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బాలమ్మ గొమాంగోకు 12 మంది కుమా రులు, 8 మంది కుమార్తెలు ఉన్నారు. కాగా నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాలం చేశారు. మిగిలిన వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కోడళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. వారితో పాటు అల్లుళ్లు, కోడలు, మనవలు, మనవరాళ్లు బాలమ్మ గొమాంగోకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా ఆయన వయసు 120 సంవత్సరాలు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కోలాహలంగా కనుమ యాత్ర

వీరఘట్టం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామంలోని నాగావళి నది తీరంలో శుక్రవారం కనుమ యాత్ర కోలాహలంగా జరిగింది. వీరఘట్టంతో పాటు వంగర, గరుగుబిల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కొందరు నదిలో పడవ ప్రయాణం చేశారు. మరికొందరు నది తీరంలో ఆటపాటలతో సందడి చేశారు.

Updated Date - Jan 17 , 2026 | 12:22 AM