Sankranti art should be seen in the farmer's house రైతు ఇంట సంక్రాంతి కళ కనిపించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:52 PM
Sankranti art should be seen in the farmer's house రైతులంతా సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని, వారు ఇబ్బంది పడకూడదనే ధాన్యం విక్రయించిన 24 గంటల్లో డబ్బులు జమ చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం వచ్చిన ఆయన భోగాపురం గంగిరావి చెరువుకింద పంటపొలాల్లో ధాన్యం నూర్పు చేసిన రైతులతో మాట్లాడారు.
రైతు ఇంట సంక్రాంతి కళ కనిపించాలి
రైతుల సంతోషమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి నాదెండ్ల మనోహర్
భోగాపురం/బొండపల్లి/డెంకాడ, జనవరి6(ఆంధ్రజ్యోతి): రైతులంతా సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని, వారు ఇబ్బంది పడకూడదనే ధాన్యం విక్రయించిన 24 గంటల్లో డబ్బులు జమ చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం వచ్చిన ఆయన భోగాపురం గంగిరావి చెరువుకింద పంటపొలాల్లో ధాన్యం నూర్పు చేసిన రైతులతో మాట్లాడారు. ఽగతంలో రైతులు ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడేవారని, మిల్లర్ల వద్దకు పంటను తీసుకెళ్లి వారం రోజులపాటు అక్కడే వేచి ఉండేవారన్నారు. ఇప్పుడు రైతు ధాన్యం మిల్లు వద్దకు తీసుకెళ్లిన వెంటనే తీసుకోవడం జరుగుతోందని, అదే విధంగా 24 గంటల్లో నగదు జమవుతోందని అన్నారు. సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకోవాలంటే రైతుల చేతుల్లో డబ్బులు ఉండాలని, గతంలో సంక్రాంతికి రైతులు ఇబ్బందులు పడేవారని అన్నారు. ఈప్రాంతంలో 1120 రకం ఎక్కువగా వేస్తున్నారని, ఈ విషయంలో రైతుల్లో మార్పు రావాలన్నారు. ధాన్యం మిల్లర్లకు అందజేయడం, నగదు జమకావడం, ధాన్యం తీసుకెళ్లడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకొన్నారు. కౌలు రైతు పతివాడ పైడినాయుడు, రైతు సంగం అప్పలసూరి మాట్లాడుతూ గతం కన్నా ప్రస్తుతం చాలా బాగుందని, నగదు జమవుతోందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే లోకంనాగమాధవి, సివిల్‌సప్లై కార్పొరేషన్ ఎండీ ఎస్.ఢిల్లీరావు, జేసీ సేదుమాధవన్, తహసీల్ధార్ రమణమ్మ, ఎంపిడివో డిడిస్వరూపరాణి తదితరులు ఉన్నారు.
కొనుగోలులో నిర్లక్ష్యమెందుకు?
ధాన్యం కొనుగోలులో రైసు మిల్లుల యాజమాన్యాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొండపల్లి మండలం రాచకిండాంలో ధాన్యం నిల్వలు, సస్యరక్షణ చర్యలపై మంగళవారం రైతులతో మమేకమయ్యారు. అనంతరం బొండపల్లిలోని లక్ష్మీనారాయణ రైస్‌మిల్లును తనిఖీ చేసి రైసు మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులతో మాట్లాడారు. మిల్లర్ల నిర్లక్ష్యం కారణంగా 17 శాతం దిగువ స్థాయిలో మిల్లింగ్ చేయడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ నెల 8వ తేదీలోగా 45 వేల మెట్రిక్ టన్నులు పూర్తిచేయని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు చెల్లించడంలో అలక్ష్యంచేసి రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వీటి.రామారావు, డీఎస్‌వో టి.మురళీనాథ్, మాజీ మంత్రి పడాల అరుణ, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, బీజేపీ నేత పావని తదితరులు ఉన్నారు.
మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి
మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. డెంకాడ మండలంలోని పెదతాడివాడ రైతు సేవ కేంద్రంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి మంగళవారం రైతులతో ముచ్చటించారు. మిల్లర్లతో మాట్లాడి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతులతో మాట్లాడుతూ అధిక దిగుబడి వచ్చే వంగడాలపై అవగాహన పెంచుకోవాలని, రైతులకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. అనంతరం సచివాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఏడాది గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పట్టణాల్లో గోధుమ పిండి కిలో రూ.20లకే అందజేస్తున్నామని, త్వరలో గ్రామాల్లో కూడా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, టీడీపీ సీనియర్ నాయకులు కంది చంద్రశేఖరరావు, మాజీ జడ్పీటీసీ కంది సూర్యనారాయణ పాల్గొన్నారు.
పండుగ ముందే చెల్లింపులు
మంత్రి నాదెండ్ల మనోహర్
విజయనగరం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పండుగ ముందు షెడ్యూలు వేసుకుని రానున్న నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు వెంటవెంటనే జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పరిషత్ అతిథిగృహంలో పౌరసరఫరాలశాఖ ఎండీ ఎస్.ఢిల్లీరావుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ధాన్యం సేకరణలో సమస్యలపై గోడౌన్‌ల సదుపాయం, మిల్లర్ల బీజీల సమస్య, స్టోరేజీ తదితర అంశాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో సమస్య ఉంటే జాయింట్ కలెక్టర్ దృష్టిలో పెట్టాలని, మిల్లర్లంతా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. 97.6 శాతం మంది రైతులకు 24 గంటల్లోనే రూ.680 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జాయింట్ కలెక్టరే సేతుమాధవన్, పౌరసరఫరాల జిల్లా మేనేజరు శాంతి, ఆర్‌డీఓ కీర్తి, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావు పాల్గొన్నారు.
మంత్రికి విన్నపాలు
శృంగవరపుకోట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మంత్రి నాదెండ్ల మనోహర్‌ను జిల్లా పౌరసరఫరాల శాఖ డీలర్ల సంఘం జిల్లా కేంద్రంలో కలిసింది. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. రూ.5000 గౌరవ వేతనంతో పాటు క్వింటాకు రూ.300 కమీషన్ పెంచాలని, ఇతర నిత్యావసర వస్తువుల అమ్మకానికి డీలర్‌కు అనుమతి ఇవ్వాలని, కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు, కుటుంబ సభ్యులకు బీమా సదుపాయం, 60 సంవత్సరాలు దాటిన డీలర్లకు పెన్సన్ ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం ప్రతినిధులు సీహెచ్ రామారావు, కొణదం ఉమామహేశ్వరరావు, ముత్యాలనాయుడు ఉన్నారు. అలాగే శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన నాయకుడు ఒబ్బిన సన్యాసినాయుడు పలు సమస్యలపై మంత్రికి వినతినిచ్చారు.