Share News

Sand Mafia... ఇసుక దందా.. ఇసుమంతైనా కనిపించదా?

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:28 PM

Sand Mafia... Not Even a Trace in Sight? జిల్లాలో ఇసుక, మట్టి దందా ఆగడం లేదు. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా కొమరాడ, పాలకొండ, సీతానగరం, బలిజిపేట, వీరఘట్టం మండలాల నుంచే అధికంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు.

Sand Mafia...  ఇసుక దందా..  ఇసుమంతైనా కనిపించదా?
కొమరాడ నాగావళి తీరంలో ట్రాక్టర్‌కు ఇసుకను లోడ్‌ చేస్తున్న దృశ్యం

  • సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

  • జిల్లాలో యథేచ్ఛగా ఇసుక, మట్టి అక్రమ రవాణా

  • మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం

పార్వతీపురం, ఏప్రిల్‌23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక, మట్టి దందా ఆగడం లేదు. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా కొమరాడ, పాలకొండ, సీతానగరం, బలిజిపేట, వీరఘట్టం మండలాల నుంచే అధికంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో ఉందనే ఆరోపణలున్నాయి. మొత్తంగా రెవెన్యూ, గనులశాఖలు ఈ అక్రమ దందాపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

కొమరాడ మండలంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకతో పాటు మట్టి దందా కొనసాగుతోంది. ఇదే మండలంలో గుమడ ప్రాంతం నుంచి ఇసుక రవాణా జరుగుతుంది. పగలు ఒక దగ్గర ఇసుకను స్టోరేజ్‌ చేసి రాత్రి వేళల్లో యంత్రాలతో లారీలు, ట్రాక్టర్లకు లోడింగ్‌ చేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఒక వైసీపీ నాయకుని ఆధ్వర్యంలో ఈ దందా జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. దీనిపై అధికారులు, కూటమి నాయకులు మౌనం వహిస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూనేరు రామభద్రపురంలోనూ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదే మండలంలో పాత కళ్లికోట, దుగ్గి తదితర ప్రాంతాల్లోనూ ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే మండలంలో గ్రావెల్‌ , మట్టి దందా కూడా ఇష్టారాజ్యంగా సాగుతోంది. డంగభద్ర, అంకుళ్లవలస, పాలకొండ, వీరఘట్టం, బలిజిపేట, సాలూరు, సీతానగరం తదితర మండలాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి, గ్రావెల్‌ను తరలిస్తూ అక్రమార్కులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక భామిని మండలం బత్తిలి ప్రాంతంలోనూ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి ఒడిశాకు తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఇసుకాసురులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశించినా.. సంబంధిత సిబ్బంది కొరడా ఝుళిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Apr 23 , 2026 | 11:28 PM