Sand Mafia శాండ్ దండు
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:08 AM
Sand Mafia నాగావళి నదిలో ఇసుకను తోడేస్తున్నారు. ఎక్కడికక్కడే దారి చేస్తూ లోతుగా గోతులు ఏర్పాటు చేస్తూ నదిని గుల్ల చేస్తున్నారు. పరోక్షంగా నదీ మార్గాన్ని కూడా మళ్లించేస్తున్నారు. ప్రకృతి వనరును కాపాడుకోవాలన్న ఇంగితాన్ని కూడా విస్మరించి దోపిడీ చేస్తున్నారు.
శాండ్ దండు
నాగావళిలో ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులు
రాత్రి పూట అధికంగా రవాణా
ఇంటి కోసమంటూ వేరొక చోట డంప్
తవ్వకాలతో ఆందోళన చెందుతున్న నదీతీర భూముల రైతులు
రహదారులూ ఛిద్రం
పట్టని అధికార యంత్రాంగం
వంగర, జూలై 12(ఆంధ్రజ్యోతి):
నాగావళి నదిలో ఇసుకను తోడేస్తున్నారు. ఎక్కడికక్కడే దారి చేస్తూ లోతుగా గోతులు ఏర్పాటు చేస్తూ నదిని గుల్ల చేస్తున్నారు. పరోక్షంగా నదీ మార్గాన్ని కూడా మళ్లించేస్తున్నారు. ప్రకృతి వనరును కాపాడుకోవాలన్న ఇంగితాన్ని కూడా విస్మరించి దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో ఇసుక అవసరాలకు ప్రధాన వనరుగా నాగావళి ఉంది. ఈ నది వంగర మండలంలో వీవీఆర్ పేట మొదలుకుని సంగాం వరకు 18 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. నది పరిసర ప్రాంతాలైన రుషింగి, తరగాం, శివ్వాం, ఒని తదితర ప్రాంతాలు ఇసుక వ్యాపారులకు కల్పవృక్షంగా మారాయి. అనుమతి తీసుకోకుండా నచ్చినట్లు తవ్వుకుపోతున్నారు. కొందరు రాత్రిపూట ఎక్స్‌కవేటర్‌తో ఇసుకను తోడి తమకు అనుకూలమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. బేరం కుదిరిన తరువాత డంపు చేసిన ఇసుకను రవాణా చేస్తున్నారు. ఆదాయం బాగుండటంతో ఒకరిని చూసి ఒకరు క్యూ కడుతున్నారు. నదిలో ఇసుక మేట కనబడితే చాలు తోడేస్తున్నారు. లేకున్నా వెతికి వెతికి ఇసుకను ఎత్తుకుపోతున్నారు. వారి తీరు వల్ల నదిలో అక్కడక్కడ గుండు రాళ్లు దర్శనమిస్తున్నాయి.
చోద్యం చూస్తున్న అధికారులు
ఇసుకను సొంత అవసరాలకు తప్పా వ్యాపార నిమిత్తం తరలించరాదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. గృహల నిర్మాణానికి ఇసుక తీసుకువెళ్తున్నామంటూ ట్రాక్టర్లలో నింపుకుని తమ సొంత స్థలంలో డంప్ చేస్తున్నారు. ఈ విధంగా వందలాది ట్రాక్టర్లు, లారీల్లో రాత్రికి రాత్రే ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారన్నది బహిరంగ విమర్శ. ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేయడంతో నదిని ఆనుకుని ఉన్న తమ భూములు కోతక గురవతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై మండల సమావేశంలో సంగాం, మగ్గూరుకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు కొద్ది రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవిస్తున్నా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- తమ పొలాల కింద ఇసుక తీయవద్దని వ్యాపారులను ఎవరైనా అడ్డుకుంటే నదిలో ఇసుక తవ్వకాలకు ‘మీకేం సంబంధం అంటూ దౌర్జన్యం చేస్తున్నారని’ మగ్గూరు, ఓని, సంగాం రైతులు వాపోతున్నారు. ఇలా ఇసుకను తవ్వకాలు చేస్తే పొలాల్లో బోరుబావులు సైతం ఎండిపోతాయని వారు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. గ్రామంలో రహదారులు కూడా ఛిద్రం కాగా నదీ గమనం మారి విలువైన పంట భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయని వాపోతున్నారు. ఇసుక అక్రమాలు కట్టడి చేయాలని కోరుతున్నారు.
మాఫియాగా మారి
వంగర మండలంలోని ఓని, తలగాం , రుషింగి, శివ్వాంలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తూ ట్రాక్టర్‌కు రూ.మూడు వేలు వసూలు చేస్తున్నారు. ఓని గ్రామం వద్ద నదిలో ఏకంగా పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి దిబ్బలుగా వేసి ప్రత్యేక రహదారి ఏర్పాటు చేసి లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. రాత్రిపూట రాష్ట్రం దాటించి రూ.లక్షలు గడిస్తున్నారు. ఓనిలో తవ్వకాల కోసం వంగర గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఏకమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే రుషింగి, తరగాంలో ఇసుక రవాణా చేస్తున్నారన్నది బహిరంగ విమర్శ.
చర్యలు తప్పవు
సొంత అవసరాలకు మాత్రమే నదుల నుంచి ఇసుకను తీసుకెళ్లవచ్చు. అలాకాకుండా ఎవరైనా ఇసుకతో వ్యాపారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. యంత్రాలు ఉపయోగించి నదుల్లో ఇసుక తోడినా ఊరుకునేది లేదు. ఓని గ్రామం వద్ద ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారన్నది స్పష్టతలేదు.
- రామారావు, తహసీల్దార్, వంగర