Share News

Sand export in wrong way ఇసుక లూటీ

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:34 PM

Sand export in wrong way

Sand export in wrong way ఇసుక లూటీ
ఇసుక రీచ్‌ నుంచి గజపతినగరం చేరిన ఇసుక లారీ

ఇసుక లూటీ

సహజ సంపదను దోచేస్తున్న కేటుగాళ్లు

అభివృద్ధి పనుల పేరుతో సచివాలయాల్లో బుకింగ్‌

బినామీల పేరుతో బిల్లులు

గుట్టలుగా పోసి రహస్య అమ్మకాలు

నిద్రపోతున్న నిఘా

జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. సహజ సంపదను కొల్లగొట్టేస్తున్నారు. నిబంధనలు, మార్గదర్శకాలకు మంగళం పాడేసి ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరులను కైంకర్యం చేస్తున్నారు. బినామీలకు తెలియకుండానే వారిపేరుతో బిల్లు తీసి అధికారుల కళ్లుగప్పి దండిగా పోగేసుకుంటున్నారు. గమ్యస్థానం ఒకటి చెప్పి, మరోచోట డంపింగ్‌ చేస్తున్నారు. అనుమతి పొందిన దానికన్నా రెట్టింపు ఇసుకను లోడ్‌ చేయిస్తూ కొంతమేర అభివృద్ధి పనులకు వినియోగిస్తూ మిగిలింది సొంత పనులకు దారి మళ్లిస్తున్నారు. ఈ అక్రమాలు, అవకతవకలకు సచివాలయాల్లో అంకురార్పణ జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి):

- కొత్తవలస సచివాలయంలో గతేడాది డిసెంబరు 4న గురజాల అనిల్‌ పేరుతో ఇసుక కోరుతూ రిజిస్ట్రేషన్‌ చేయగా అందులో ఎందుకు? ఎక్కడ్నుంచి ఎక్కడకు వంటి వివరాలు ఏవీలేవు. పరిమాణం మాత్రం 145 టన్నుల ఇసుక అని పేర్కొని ఉంది. అందులో ఉన్న గురజాల అనిల్‌కు ఫోన్‌ చేస్తే, ఆ రిజిస్ట్రేషన్‌తో తనకు సంబంధమేలేదని తేల్చేశాడు. తాను ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌నని, ఏదోపని ఉందని తన ఆధార్‌ కార్డు అడిగితే బొడ్డవలస రీచ్‌ వద్ద ఇచ్చానని, అంతకుమించి తనకేమీ తెలీదని స్పష్టం చేశాడు.

- ఈనెల 23(శుక్రవారం)న రాత్రి ఇసుకలోడుతో గజపతినగరంలో కనిపించిన లారీ డ్రైవర్ని అడిగితే రేగిడి మండలం బొడ్డవలస స్టాక్‌ పాయింట్‌ నుంచి ఇసుక తీసుకొస్తున్నట్టు చెప్పారు. వినియోగదారు కాపీపై మాత్రం తిరుమల బాలాజీ ప్రైవేటు లిమిటెడ్‌ పేరు ఉంది. అందులో వినియోగదారుని ఫోన్‌ నెంబరు విశాఖ హౌసింగ్‌ పీడీ సూరిబాబుది. తమ డిపార్ట్‌మెంట్‌ విజయనగరం జిల్లా రీచ్‌ల నుంచి ఇసుక తీసుకురావడం లేదని ఆయన స్పష్టం చేశారు.

కస్టమర్‌ కాపీలో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే కొత్తవలస మండలం దేవాడ సచివాలయం నుంచి రిజిస్టర్‌ అయినట్లు ఉంది. వినియోగధారుడు తనకు ఇసుక రిజిస్ట్రేషన్‌ గురించి తెలియదని అంటున్నాడు. కొత్తవలస పీఆర్‌ జేఈ స్వామినాయుడు కూడా తాము ఇసుకకు ఇండెంట్‌ పెట్టలేదని, అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. అంటే అభివృద్ధి పనుల ముసుగులో వేలాది టన్నుల ఇసుకను కొల్లగొట్టేస్తున్నారని స్పష్టమవుతోంది. గమ్మత్తేమంటే ఈ ఇసుక వినియోగదారు కాపీపై ఉన్న ఫోన్‌ నంబర్‌ విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఒకశాఖ జిల్లాస్థాయి అధికారిది. వివరాలు రాబట్టేందుకు ఆ ఫోన్‌ నంబరుకు ఆంధ్రజ్యోతి ఫోన్‌ చేయగా, తాను విశాఖలో ఒక శాఖకు ఉన్నతాధికారినని చెప్పారు. రసీదుపై తన నంబర్‌ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

పనులకు కొంతే..

జిల్లాలోని ఒక ఆసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనుల పేరుతో శ్రీకాకుళం జిల్లాలోని ఒకస్టాక్‌ పాయింట్‌ నుంచి బినామీల పేరుతో వందలాది వాహనాలతో ఇసుకను ఇక్కడికి తీసుకువస్తూ అందులో కొంతమేర పనులకు కేటాయిస్తూ మిగిలింది యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘనులు ఎక్కడికక్కడే పోగుపడి ఉన్నారు. ఊరూపేరు లేని వారి పేరుమీద, బినామీల పేర్లు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి డెలివరీ పాయింట్‌కు చేరకముందే మార్గమధ్యలో దారిమళ్లించి ఒక రహస్య ప్రదేశంలో గుట్టలుగా పోగులు వేసుకొని డిమాండ్‌ను బట్టి లారీ లోడును రూ.50 వేల వరకు అమ్మకాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది.

- నదీ పరివాహక ప్రాంతాల్లోనివారు కూడా వెసులబాటును వినియోగించుకొని వందలాది నాటుబళ్లతో తరలిస్తూ కొండల్లా గుట్టలు పోసి రాత్రి సమయాల్లో గుట్టుగా రవాణా చేస్తూ లక్షలు పోగేసుకుంటున్నారు.

నిఘా ఏమైందో

ఇసుకతో అడ్డదారిలో వ్యాపారం చేసుకుపోతుంటే.. కాసుల వేటే లక్ష్యంగా సంపద సంపదను లూటీ చేస్తుంటే నిఘా ఏమైందో.. అధికారులు ఏం చేస్తున్నారో అర్థంకావడం లేదు. ఇసుకాసురుల నుంచి వీరికి స్థాయిని బట్టి పెద్దమొత్తంలోనే ముడుతున్నట్టు పబ్లిక్‌గానే వినిపిస్తోంది. శుక్రవారం రాత్రి గజపతినగరం వచ్చిన ఇసుక లారీ ఓ ప్రజాప్రతినిధి బంధువు చేపట్టిన కాలువల నిర్మాణానికి వచ్చినట్లు డ్రైవర్‌ చెప్పడం గమనార్హం. మొత్తమ్మీద శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అధికారులు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 25 , 2026 | 11:34 PM