“Same Old Issues This Time Too? ఈసారికి .. అవేనా?
ABN , Publish Date - May 13 , 2026 | 12:01 AM
“Same Old Issues This Time Too? సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులకు ఉప యోగపడని వ్యవయసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏసీఏ టు టీఎస్‌ఎస్ నిధులతో 90శాతం రాయితీ కింద అందిస్తున్న యంత్ర పరికరాల్లో నాణ్యత లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కంపెనీల పేర్లతో ప్రతిపాదనలు పంపినా సరఫరా కాని వైనం
పవర్‌టిల్లర్లు మార్చాలని ట్రైకార్‌కు లేఖ రాసిన ఐటీడీఏ అధికారులు
గిరిజన రైతులకు సర్దిచెప్పాలని పైనుంచి ఆదేశాలు
పెదవి విరుస్తున్న గిరిజన సంఘాలు
సీతంపేట రూరల్, మే12(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులకు ఉప యోగపడని వ్యవయసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏసీఏ టు టీఎస్‌ఎస్ నిధులతో 90శాతం రాయితీ కింద అందిస్తున్న యంత్ర పరికరాల్లో నాణ్యత లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.2.34కోట్లతో సరఫరా అయిన వాటిల్లో కెప్టెన్ కంపెనీకి చెందిన 25 మినీట్రాక్టర్లు, 13హెచ్‌పీ(హార్స్‌పవర్) కలిగిన 28 పవర్‌టిల్లర్లు, 53 పవర్‌వీడర్లు, ఆయిల్ ఇంజన్లు ఉన్నాయి. 15హెచ్‌పీ పవర్‌టిల్లర్లు అవసరమని ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు పంపినా.. 13హెచ్‌పీవి మాత్రమే ఐటీడీఏకు సప్లయ్ చేశారు. కాగా 15హెచ్‌పీ ఖరీదుతో బిల్లులు ఐటీడీఏకు సబ్మిట్ చేయడం విశేషం. పవర్ టిల్లర్ల విషయంలో గిరిజన రైతులకు సర్దిచెప్పాలని పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. సెంట్రలైజ్‌డ్ టెండర్ విధానం ద్వారా సరఫరా చేసిన యంత్ర పరికరాల పేమెంట్ కోసం పై అఽధికారుల నుంచి ఒత్తిళ్లు కొనసాగుతునే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నాణ్యతలేని సాగు పరికరాలను అంటగట్టేందుకు చూస్తుండడంపై గిరిజన సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
గుట్టుగా ఉంచారు..
ట్రైకార్(షెడ్యూల్డ్ ట్రైబ్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్)పథకం ద్వారా పంపిణీ చేయనున్న యంత్ర పరికరాలను ఐటీడీఏ అధికారులు గుట్టుగా ఉంచారు. అవి ఐటీడీఏకు వచ్చి సుమారు 40రోజులు కావస్తున్నా.. గిరిజన రైతులకు కనపడకుండా ఉంచడం వెనుక గల ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. యంత్ర పరికరాలు ఏవేవి వచ్చాయి, వాటి కంపెనీలు వివరాలు, సామర్థ్యం, ఎంతవరకు ఉపయోగపడతాయనే వివరాలను రైతులు పరిశీలించుకొని... వారికి అవసరమైన వాటి కోసం దరఖాస్తులు చేసుకొనే అవకాశాన్ని ఇవ్వడం లేదు. కాగా యంత్ర పరికరాల్లో డొల్లతనం బయటపడడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. గిరిజన రైతుల అభిప్రాయాల మేరకు గతంలో రాష్ట్ర ట్రైకార్ విభాగానికి ప్రతిపాదనలు పంపారు. అయితే వాటిని పక్కన పెట్టి వేరే కంపెనీలకు చెందిన యంత్ర పరికరాలను సరఫరా చేశారు. వాటిన చూసిన కొందరు గిరిజన రైతులు అక్కరకు రాని యంత్ర పరికరాలు తీసుకునేందుకు వెనుకంజ వేశారు.
యంత్ర పరికరాల అందజేత కార్యక్రమానికి తాను హాజరవుతానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పడంతో.. పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేశారు. మరో వైపు ఇదే అంశంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘రాయితీ సరే మరి నాణ్యత సంగతేంటి’ అనే కథనంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబ ను వివరణ కోరగా.. ‘మేము రాసిన స్పెసిఫికేషన్స్‌కు అనుగుణంగా ఉన్న వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణి చేస్తాం. 13హెచ్‌పీ పవర్‌టిల్లర్లపై రాష్ట్ర ట్రైకార్ విభాగానికి లేఖ రాశాం. రైతుల ఆసక్తి మేరకు యంత్ర పరికరాలను పంపిణీ చేస్తాం.’ అని తెలిపారు.