Share News

230 మందికి పైగా విద్యార్థినులకు కేజిన్నర పప్పుతో సాంబారా?

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:30 AM

సీతంపేట కేజీబీవీలో 230కి పైగా విద్యార్థినులు ఉండగా.. కేవలం కేజిన్నర కందిపప్పుతో సాంబారు ఎలా తయారు చేస్తారని వార్డెన్‌, కుక్‌ను రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు బి.కాంతారావు ప్రశ్నించారు. బాలికలు పెట్టే మెనూ ఇలా ఉంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తొలుత సీతంపేట ఐటీడీఏ సమీపంలో ఉన్న సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌ను పరిశీలించారు.

230 మందికి పైగా విద్యార్థినులకు  కేజిన్నర పప్పుతో సాంబారా?
సీతంపేట కేజీబీవీలో సాంబారులో పప్పు శాతాన్ని పరిశీలిస్తున్న స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు కాంతారావు

  • మెనూ అమలు ఇలాగేనా..

సీతంపేట రూరల్‌, జూలై7(ఆంధ్రజ్యోతి): సీతంపేట కేజీబీవీలో 230కి పైగా విద్యార్థినులు ఉండగా.. కేవలం కేజిన్నర కందిపప్పుతో సాంబారు ఎలా తయారు చేస్తారని వార్డెన్‌, కుక్‌ను రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు బి.కాంతారావు ప్రశ్నించారు. బాలికలు పెట్టే మెనూ ఇలా ఉంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తొలుత సీతంపేట ఐటీడీఏ సమీపంలో ఉన్న సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌ను పరిశీలించారు. రికార్డులు, గోడౌన్‌లో స్టాక్‌ను సరిపోల్చారు. ఆ తర్వాత స్థానిక కేజీబీవీని సందర్శించారు. వంటగదిని పరిశీలించి బాలికల కోసం తయారుచేస్తున్న వంటలను తనిఖీ చేశారు. అయితే మూడు కేజీలకు బదులు ఒక కేజీ కంది పప్పుతో సాంబారు తయారు చేయడంపై మండిపడ్డారు. తాను పాఠశాలకు వస్తున్నప్పుడే మెనూ ఇలా ఉందంటే మామూలు రోజుల్లో ఇక్కడ పరిస్థితి ఏంటోనని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ పక్కాగా అమలుచేయాలని ప్రిన్సిపాల్‌ మాధవి, వార్డెన్‌ సుజాతను ఆదేశించారు కేజీబీవీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తహసీల్దార్‌ శ్రీకన్యకు సూచించారు. ఆ తర్వాత బాలికలతో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కగా చదువుకోవాలన్నారు. అక్కడి నుంచి నేరుగా గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నతపాఠశాల, ఏపీఆర్‌ గిరిజన బాలికల పాఠశాల, కళాశాలకు చేరుకున్నారు. స్టాక్‌రూం, వంటగది, మరుగుదొడ్లును పరిశీలించి పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్ల నిర్వహణ సరిగా ఉండాలని ఆదేశించారు. స్టాక్‌రూంలో రిజిస్టర్‌ అందుబాటులో లేకపోవడంపై గురుకుల బాలికల పాఠశాల వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పరిశీలనలో పాలకొండ డిప్యూటీ ఈవో పి.కృష్ణమూర్తి, ఎంఈవో ఆనందరావు, సీఎస్‌డీటీ శ్రీవిద్య తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 10:53 AM