‘టిడ్కో’ గృహాలకు మోక్షం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:24 AM
టిడ్కో గృహాలకు మోక్షం లభించింది. పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసి పేదలకు గృహ యోగం కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
-చురుగ్గా కొనసాగుతున్న పనులు
-బొబ్బిలిలో 1,296 ప్లాట్ల నిర్మాణం పూర్తి
- మరో 432 ప్లాట్లు, మౌలిక వసతుల పనుల్లో ప్రగతి
- జూన్‌లో లబ్ధిదారులకు అందిస్తామంటున్న అధికారులు
బొబ్బిలి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): టిడ్కో గృహాలకు మోక్షం లభించింది. పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసి పేదలకు గృహ యోగం కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ గృహాలను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాటు పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు పూర్తికాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనుల్లో కదలిక వచ్చింది. టిడ్కో రుణం పునరుద్ధరణ కావడంతో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు, లబ్ధిదారులకు భరోసా లభించినట్లయింది. జూన్ నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గత వైసీపీ ప్రభుత్వం కొంతమంది ఇళ్లను రద్దు చేయడంతో వాటి డిపాజిట్ల చెల్లింపు వాపసు కూడా చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించడంతో లబ్ధిదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బొబ్బిలిలో పరిస్థితి..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బొబ్బిలి పట్టణ పరిధిలోని రామన్నదొరవలస మునిసిపల్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇక్కడ 300 చదరపు అడుగుల ఎ.కేటగిరీలో 71 ఇళ్లతో 35 బ్లాకులు, 365 చదరపు అడుగుల బి.కేటగిరీలో 48 ఇళ్లతో ఒక బ్లాకు, 430 చదరపు అడుగుల సి.కేటగిరీలో 144 ఇళ్లతో మూడు బ్లాకుల నిర్మాణాలను అప్పట్లో ప్రారంభించారు. ప్రస్తుతం బి.కేటగిరీలో ఒక బ్లాకు పెండింగ్‌లో ఉంది. సి.కేటగిరిలో 2, 3 ఫ్లోర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం అన్ని కేటగిరీల్లో 1,680 ప్లాట్ల నిర్మాణానికి గాను 1296 ప్లాట్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 432 ప్లాట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 26 బ్లాకులు నూరు శాతం పూర్తయ్యాయని, మిగిలిన వాటిని చకచకా పూర్తి చేసి జూన్‌కల్లా లబ్ధిదారులకు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా కనెక్షన్ల పనులు కూడా పూర్తయ్యాయి. రూ.8.9 కోట్లతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, రూ.4.5 కోట్లతో విద్యుత్, రూ.3.68 కోట్లతో ఎస్‌టీపీ (మురుగునీటి శుద్ధి ప్లాంట్) నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం టిడ్కో కాలనీ ప్రాజెక్టు వ్యయం రూ. 112.36 కోట్లు.
తాగునీటి పథకం సంగతేంటి?
రామభద్రపురం మండలం అప్పలరాజుపేట గ్రామం వద్దనున్న వేగావతి నది నుంచి బొబ్బిలి టిడ్కో కాలనీకి తాగునీరందించేందుకు అప్పట్లో అధికారులు ప్రతిపాదించారు. అయితే, ఈ మేరకు మంజూరు చేసిన పనులు కారణమేంటో తెలియదు గానీ రద్దయ్యాయి. ప్రస్తుతం తాగునీటికి బోర్లుపైనే ఆధారపడక తప్పడం లేదు. శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలాఉండగా, టిడ్కో కాలనీతో పాటు ఆ పక్కనే గల జగనన్న కాలనీలో ఉన్న బోరు మోటార్లు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ఎత్తుకుపోతున్నారు. దొంగలబారి నుంచి ఈ సామగ్రిని కాపాడుకునేందుకు సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.
జూన్ నాటికి పూర్తిచేస్తాం
బొబ్బిలిలో టిడ్కో గృహ సముదాయాలను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తాం. మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 20 శాతం పూర్తయ్యాయి. ఎస్‌టీపీ పనులు 70 శాతం పూర్తయ్యాయి. విద్యుత్ పరికరాలు, వైర్లు వంటివి చోరీకి గురవుతున్నాయి. 4 మీటర్ల లోతులో ఉన్న విద్యత్ కేబుళ్లను దొంగలు తవ్వుకుపోతున్నారు. బోర్లకు గల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఎత్తుకుపోతున్నారు. కాపలాదారులను పెట్టినా దొంగతనాలు ఆగడం లేదు. దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు చేశాం. అన్నీ త్వరలోనే చక్కబడతాయి.
-పి.శ్రీరామ్మూర్తి, టిడ్కో ఈఈ, విజయనగరం