Ganesha! వినాయకా నమోస్తుతే!
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:04 AM
Salutations to Lord Ganesha! జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణపతి బప్పామోరియా, జై గణనాథ నినాదాలతో పల్లెలు, పట్టణాలు మార్మోగాయి. ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రారంభమైన ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన జిల్లావాసులు
మర్మోగిన గణనాథుడి నామస్మరణ
పార్వతీపురం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణపతి బప్పామోరియా, జై గణనాథ నినాదాలతో పల్లెలు, పట్టణాలు మార్మోగాయి. ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో సుమారు వెయ్యికి పైబడి మండపాలు ఏర్పాటు చేశారు. ప్రతి మండపం వద్ద కనీసం రూ.15 వేలు విలువ చేసే విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో విగ్రహాల కొనుగోలుకే జిల్లా వాసులు సుమారు రూ.కోటీ 50 లక్షలు వెచ్చించారు. మరోవైపు పూజా సామాగ్రి, పూలు, పండ్లు తదితర ధరలు అమాంతం పెరగ్గా.. ఒక్కో ఇంటికి సుమారు రూ. వెయ్యి పైనే ఖర్చయింది.
వినాయక వేడుకలకు ఆ గ్రామం దూరం..?
సీతంపేట: ఇసుకగెడ్డ గ్రామస్థులు ఏటా వినాయకచవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునే వారు. అయితే గత మూడేళ్లుగా గ్రామంలో మండపం ఏర్పాటు చేయడం లేదు. గ్రామస్థులు ఎవరి ఇంటి వద్ద వారే పండుగను జరుపుకుంటున్నారు. మొత్తంగా పండగ పర్వదినంలో కూడా ఆ గ్రామంలో సందడి లేకుండాపోయింది. ఆ గ్రామంలో 20పైగా గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంలో గ్రామానికి చెందిన ఎవరో ఒకరు అకాల మరణం చెందుతుండడంతో గ్రామస్థులు కొన్నాళ్లుగా ఆ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. బహిరంగంగా చవితి వేడుకలు నిర్వహించరాదని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. ఎవరి ఇంటిలో వారే వినాయక పూజలు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.