Share News

సురక్షిత ప్రయాణమే లక్ష్యం

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:19 AM

ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా ఉంటారు.

సురక్షిత ప్రయాణమే లక్ష్యం

- ఆర్టీసీ ప్రగతి రథ సారథులు డ్రైవర్లు

- విధి నిర్వహణలో అనారోగ్య సమస్యలు

- పని ఒత్తిడే కారణం

- కానరాని వైద్య పరీక్షలు

- నేడు ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం

-ఈ నెల 19న రాజాం నుంచి విజయనగరం వెళుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అప్పన్నవలస వద్ద బోల్తా పడింది. డ్రైవర్‌ అప్పలగురువులుకు ఫిట్స్‌ రావడంతో స్టీరింగ్‌ అదుపు తప్పి బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 87 మంది ఉన్నారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

- గత ఏడాది అక్టోబరు 4న రామభద్రపురం బస్టాండ్‌ వద్ద దాసు అనే కండక్టర్‌ గుండెపోటుతో మృతిచెందాడు. సాలూరు నుంచి విశాఖపట్నం వెళుతున్న బస్సులో కూర్చున్న సీట్లోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందారు.

విజయనగరం రింగురోడ్డు/ రాజాం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా ఉంటారు. వర్షం, ఎండ, చలి, పండుగ, నిరసనలు ఏవున్నా రోడ్డుపైకి బస్సులు తీసుకువెళ్తారు. వేలాది మందిని గమ్యానికి చేర్చే బాధ్యతను భుజాలపై వేసుకుంటారు. రోడ్లపై అశ్రద్ధగా దాటే వాహనాలు, ట్రాఫిక్‌ ఒత్తిడి, సమయపాలన అన్ని కలిసి డ్రైవర్‌ మనసుని కలవరపెడుతుంటాయి. అయినా ప్రయాణికులు సురక్షితంగా దిగే వరకూ వారి ముఖంపై అలసట కనిపించదు. ఒకవైపు పాతబడిన బస్సులను నడుపుతూ.. ఇంకొక వైపు పని ఒత్తిడిని తట్టుకొని ఆర్టీసీ ప్రగతికి కృషి చేస్తుంటారు. లీటరు డీజిల్‌తో అత్యధిక కిలోమీటర్లు (కెఎంపీఎల్‌) ప్రయాణించి ఆర్టీసీ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల కొంతమంది డ్రైవర్లు జిల్లాస్థాయిలో ఉత్తమ కెఎంపీఎల్‌ అవార్డులు అందుకున్నారు. శనివారం ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ఇదీ పరిస్థితి..

ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాలం చెల్లిన బస్సులు ఓ వైపు, గోతుల రహదారులు ఇంకోవైపు ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ఉద్యోగులు అనారోగ్యానికి గురికావడం మాత్రం భయంగొలుపుతోంది. బస్సు డ్రైవర్‌ అంటే ఒకరు కాదు. వందలాది మంది ప్రాణాలు వారి చేతుల్లో ఉంటాయి. కానీ వారి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయాలి. ముఖ్యంగా 17 రకాల వైద్య పరీక్షలు తప్పనిసరి. ప్రతి మూడు, ఆరు నెలలు ఒకసారి వారికి వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేయాలి. బీపీ, షుగర్‌, కంటి పరీక్షలతో పాటు ఈసీజీ వంటివి చేస్తుండాలి. అప్పుడే వారి ఆరోగ్య సమస్యలు గుర్తించవచ్చు. కానీ, ఆర్టీసీలో అటువంటిదేమీ లేకుండా పోతోందన్న విమర్శలున్నాయి. దీంతో విధి నిర్వహణలో వారు అనారోగ్యానికి గురవుతున్నారు.

జిల్లాలో విజయనగరం, ఎస్‌.కోట ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 179 ఆర్టీసీ బస్సులు రోజుకు సగటున 63 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. మొత్తం డ్రైవర్లు, కండక్టర్లు, డిపోల్లో గ్యారేజ్‌ సిబ్బంది 820 మంది ఉన్నారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో నూతన నియామకాలు లేవు. అటు కొత్త బస్సుల జాడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు 11 కొత్త బస్సులను సమకూర్చింది. త్వరలో మరికొన్ని బస్సులు రానున్నాయి. అయితే ఈ రెండు డిపోల్లో కాలం చెల్లిన బస్సులు అటు సిబ్బందికి, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి.

డ్రైవర్లపై పని ఒత్తిడి

సిబ్బంది కొరత కారణంగా డ్రైవర్లపై పని భారం పడుతోంది. 8 గంటల పాటు డ్యూటీ చేయాల్సి ఉండగా 12 గంటలకు మించి చేయాల్సి వస్తోంది. దీంతో మెడ, నడుము నొప్పులు, కంటి చూపు తగ్గడం, మధుమేహం, బీపీ వంటి అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయలేకపోవడం వారి ఆరోగ్యాన్ని మరింత కుంగదీస్తున్నాయి. నిర్ణీత సమయానికి గమ్యాన్ని చేరుకోవాలనే ఒత్తిడి, ట్రాఫిక్‌ ఇబ్బందులు డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. షిఫ్టుల మార్పులతో సరైన నిద్ర ఉండడం లేదు. ఇది రక్తపోటు (బీపీ) పెరగడానికి కారణమవుతోంది. సమయానికి ఆహారం లేకపోవడం, రోడ్డుపక్కన దొరికే ఆహారం తినడం వల్ల మధుమేహం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. రోడ్డుపై ఉన్న వేడి, బస్సు ఇంజిన్‌ నుంచి వచ్చిన సెగ కారణంగా డ్రైవర్లు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఇది వారి మెదడుపై ప్రభావం చూపి తలతిరగడం లేదా స్పృహ కోల్పోవడం వంటి వాటికి కారణమవుతోంది. తెల్లవారుజామున డ్యూటీలు, రాత్రి ప్రయాణాలతో వారి సహజ నిద్ర చక్రం దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో చిరాకు, డిప్రెషన్‌, గుండెజబ్బులకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బస్సును జాగ్రత్తగా నడుపుతా

బస్సును మెల్లగా, జాగ్రత్తగా నడపడం వల్లే మంచి కెఎంపీల్‌ సాధ్యమైంది. వేగం కాదు నియంత్రణే ముఖ్యం. దీని వల్ల ఇంధనం కూడా ఆదా కావడమే కాకుండా ప్రయాణికుల భద్రత పెరుగుతుంది. ఇప్పటి వరకూ నేను ఏడు పర్యాయాలు అవార్డు అందుకున్నాను.

-లింగాల శివాజీ, బస్సు డ్రైవర్‌, విజయనగరం

===========

ట్రాఫిక్‌ను ముందే అంచనా వేయాలి

అతి వేగంతో డీజిల్‌ వృథా అవ్వడమే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతాయి. దూరంగా సిగ్నల్‌ పడడం లేదా రద్దీ ఉండడం గమనించినప్పుడే ఎక్సలేటర్‌ తగ్గించి గేరు మార్చుకుంటాను. దీని వల్ల బ్రేకులు వేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పటి వరకూ ఆరు సార్లు ఉత్తమ డైవర్‌ అవార్డుని అందుకున్నాను.

-- అయినాడ అప్పారావు, ఆర్టీసీ డ్రైవర్‌, విజయనగరం

============

సమయానికి తినాలి

చాలా మంది డ్యూటీ ఒత్తిడిలో నీళ్లు తాగడం, సమయానికి తినడం మర్చిపోతారు. కానీ నేను ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం బాక్స్‌ను నిర్ణీత సమయానికి తింటాను. డీజిల్‌ పొదుపు సాధించాలంటే డ్రైవర్ల మనస్సు ప్రశాంతంగా ఉండాలి. టెన్షన్‌ పడితే, ఎక్స్‌లేటర్‌పై ఒత్తిడి పెరిగి కెఎంపీఎల్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. నేను మూడు సార్లు డిపో స్థాయిలో అవార్డులు గెలుచుకోవడం ఆనందంగా వుంది.

-వి.రాజు, ఆర్టీసీ డ్రైవర్‌, విజయనగరం

===============

బాధ్యత ఉండాలి..

ఆర్టీసీని కాపాడుకోవలసిన బాధ్యత డ్రైవర్ల అందరిపై ఉండాలి. ఒక్కొక్క డ్రైవర్‌ రోజుకి రెండు లీటర్లు డీజిల్‌ పొదుపు చేసినా, సంస్థకు కోట్లాది రూపాయలు మిగులు ఉంటుంది. ఆ ఆలోచనతోటే నేను డ్రైవింగ్‌ చేస్తాను. ఎప్పుడు నా కెఎంపీఎల్‌ టార్గెట్‌ కంటే తగ్గలేదు. అధికారులు ప్రోత్సాహం ఉంటే మరిన్ని అవార్డులు సాధిస్తాను.

-పీఈ రాజు, ఆర్టీసీ డ్రైవర్‌, విజయనగరం

================

ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి..

ప్రతి రెండు గంటల ప్రయాణం తరువాత కనీసం ఐదు నుంచి పది నిమిషాలు విరామం అవసరం. స్టీరింగ్‌ వద్ద కూర్చుని చేసే చిన్నపాటి వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి. డ్రైవర్లకు యోగా, ధ్యానంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. కార్మికుల సంక్షేమ నిధి ద్వారా డ్రైవర్ల కుటుంబాలకు ఉచిత ఆరోగ్యబీమా కల్పించి వారి మానసిక భారాన్ని తగ్గించాలి. ఆరు నెలలకు ఒకసారి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యలు ముందే గుర్తించి నివారించవచ్చును.

-డాక్టర్‌ పీఎస్‌వీ రామారావు

సిబ్బంది ఆరోగ్యానికి పెద్దపీట

ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాం. ఫిట్నెస్‌ పరీక్షలు నిర్వహిస్తాం. ప్రజారవాణే ఆర్టీసీ ధ్యేయం. కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమే. కానీ వాటిని అధిగమించి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం. ఇటీవల కొత్త రూట్లలో బస్సులు సైతం నడుపుతున్నాం. సంక్రాంతికి మెరుగైన సేవలందించాం.

-వరలక్ష్మి, ప్రజా రవాణా అధికారి, విజయనగరం

Updated Date - Jan 24 , 2026 | 12:19 AM