Safe Travel సురక్షిత ప్రయాణమే లక్ష్యం
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:56 PM
Safe Travel Is the Goal ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం’.. ఇదీ ప్రజారవాణా సంస్థ(ఆర్టీసీ) నినాదం. కాగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లదే కీలకపాత్ర. ఎంత పని ఒత్తిడి ఉన్నా వారు మాత్రం అప్రమత్తంగా ఉంటారు.
విధి నిర్వహణలో అనారోగ్య సమస్యలు
పని ఒత్తిడే కారణం
కానరాని వైద్య పరీక్షలు
అయినా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే ధ్యేయం
నేడు ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం
పార్వతీపురం టౌన్/సాలూరు/పాలకొండ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం’.. ఇదీ ప్రజారవాణా సంస్థ(ఆర్టీసీ) నినాదం. కాగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లదే కీలకపాత్ర. ఎంత పని ఒత్తిడి ఉన్నా వారు మాత్రం అప్రమత్తంగా ఉంటారు. వర్షం, ఎండ, చలి, పండుగ, నిరసనలు ఏవున్నా రోడ్డుపైకి బస్సులు తీసుకువెళ్తారు. వేలాది మందిని గమ్యానికి చేర్చే బాధ్యతను భుజాలపై వేసుకుంటారు. రోడ్లపై అశ్రద్ధగా దాటే వాహనాలు, ట్రాఫిక్ ఒత్తిడి, సమయపాలన అన్ని కలిసి డ్రైవర్ మనసుని కలవరపెడుతుంటాయి. అయినా ప్రయాణికులు సురక్షితంగా దిగే వరకూ వారి ముఖంపై అలసట కనిపించదు. ఒకవైపు పాతబడిన బస్సులను నడుపుతూ.. ఇంకొక వైపు పని ఒత్తిడిని తట్టుకొని ఆర్టీసీ ప్రగతికి కృషి చేస్తుంటారు. లీటరు డీజిల్‌తో అత్యధిక కిలోమీటర్లు (కెఎంపీఎల్) ప్రయాణించి ఆర్టీసీ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల కొంతమంది డ్రైవర్లు జిల్లాస్థాయిలో ఉత్తమ కెఎంపీఎల్ అవార్డులు అందుకున్నారు. నేడు ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఇదీ పరిస్థితి..
ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాలం చెల్లిన బస్సులు ఓ వైపు, గోతుల రహదారులు ఇంకోవైపు ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ఉద్యోగులు అనారోగ్యానికి గురికావడం మాత్రం భయంగొలుపుతోంది. బస్సు డ్రైవర్ అంటే ఒకరు కాదు. వందలాది మంది ప్రాణాలు వారి చేతుల్లో ఉంటాయి. కానీ వారి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్‌నెస్ పరీక్షలు చేయాలి. ముఖ్యంగా 17 రకాల వైద్య పరీక్షలు తప్పనిసరి. ప్రతి మూడు, ఆరు నెలలు ఒకసారి వారికి వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేయాలి. బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు ఈసీజీ వంటివి చేస్తుండాలి. అప్పుడే వారి ఆరోగ్య సమస్యలు గుర్తించవచ్చు. కానీ, ఆర్టీసీలో అటువంటిదేమీ లేకుండా పోతోందన్న విమర్శలున్నాయి. దీంతో విధి నిర్వహణలో వారు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లాలో పాలకొండ, సాలూరు, పార్వతీపురంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. సుమారుగా 262 ఆర్టీసీ బస్సులు రోజుకు సగటున 90 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. మొత్తం డ్రైవర్లు, కండక్టర్లు, డిపోల్లో గ్యారేజ్ సిబ్బంది 900 మంది ఉన్నారు. అయితే ఆయా డిపోల్లో కాలం చెల్లిన బస్సులు అటు సిబ్బందికి, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి.
డ్రైవర్లపై పని ఒత్తిడి
సిబ్బంది కొరత కారణంగా డ్రైవర్లపై పని భారం పడుతోంది. 8 గంటల పాటు డ్యూటీ చేయాల్సి ఉండగా 12 గంటలకు మించి చేయాల్సి వస్తోంది. దీంతో మెడ, నడుము నొప్పులు, కంటి చూపు తగ్గడం, మధుమేహం, బీపీ వంటి అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయలేకపోవడం వారి ఆరోగ్యాన్ని మరింత కుంగదీస్తున్నాయి. నిర్ణీత సమయానికి గమ్యాన్ని చేరుకోవాలనే ఒత్తిడి, ట్రాఫిక్ ఇబ్బందులు డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. షిఫ్టుల మార్పులతో సరైన నిద్ర ఉండడం లేదు. ఇది రక్తపోటు (బీపీ) పెరగడానికి కారణమవుతోంది. సమయానికి ఆహారం లేకపోవడం, రోడ్డుపక్కన దొరికే ఆహారం తినడం వల్ల మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతున్నాయి. రోడ్డుపై ఉన్న వేడి, బస్సు ఇంజిన్ నుంచి వచ్చిన సెగ కారణంగా డ్రైవర్లు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఇది వారి మెదడుపై ప్రభావం చూపి తలతిరగడం లేదా స్పృహ కోల్పోవడం వంటి వాటికి కారణమవుతోంది. తెల్లవారుజామున డ్యూటీలు, రాత్రి ప్రయాణాలతో వారి సహజ నిద్ర చక్రం దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో చిరాకు, డిప్రెషన్, గుండెజబ్బులకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సంస్థ అభివృద్ధే లక్ష్యం
ఆర్టీసీ సంస్థ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాను. గత 15 ఏళ్లుగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రయాణికులను గమ్యస్థానాలను సురక్షితంగా చేర్చడంలో నా వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నా. అంతే కాకుండా గత ఏడాది పార్వతీపురం డిపోలో ఉత్తమ డ్రైవరుగా నిలవడం సంతోషంగా ఉంది.
- బీవీ రమణ, డ్రైవర్, పార్వతీపురం డిపో
=================================
అతివేగంగా వెళ్లలేదు..
ఆర్టీసీ బస్సు డ్రైవరుగా గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. మరో 14 నెలల్లో ఉద్యోగ విరమణ చేసే అవకాశం వస్తునందుకు ఆనందంగా ఉంది. నా ఉద్యోగ నిర్వహణలో ఇప్పటివరకు అతివేగంగా బస్సును నడపలేదు. మద్యం తాగడం వంటి చెడు వ్యసనాల జోలికి పోలేదు. కుటుంబ సభ్యులు, అధికారుల సహకారంతో నా బాధ్యతలను సమర్థంగా నిర్వహించా.
- టి. సత్యారావు, డ్రైవర్, పార్వతీపురం డిపో
=================================
ఆ సంతోషమే వేరు..
నేను 2010లో ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాను. నాటి నుంచి ఆర్టీసీలో నిత్యం 6.40 కేఎంపీఎల్ సాధిస్తూనే ఉన్నా. బస్సు నడుపుతుంటే ఆ సంతోషమే వేరు. పలుమార్లు నగదు రివార్డుతోపాటు పలువురి నుంచి సత్కారాలు పొందాను. బస్సు నడుపుతూ ఉంటే నా కుటుంబ సభ్యులను గమ్యస్థానాలకు చేర్చినంత ఆనందంగా ఉంటుంది.
- జేఏ రాజు, ఆర్టీసీ డ్రైవర్, సాలూరు
=================================
ఏ ఆలోచనలు ఉండవు..
బస్సు నడుపుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. బస్సులో ఉన్నంతసేపు ఇంకా ఎలాంటి ఆలోచనలు ఉండవు. ప్రశాంతంగా బస్సు నడుపుతా. అందుకే నిత్యం 5.98 కేఎంపీఎల్ సాధిస్తునే ఉన్నా. ఇప్పటికి ఎన్నోసార్లు క్యాష్ రివార్డుతోపాటు ఆర్టీసీ అధికారులతో ప్రశంసలు పొందాను.
- ఎ.సీతారాం, ఆర్టీసీ డిపో డ్రైవర్, సాలూరు