పాపం గిరిజనులు..
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:36 AM
ఎస్.కోట పోలీస్ స్టేషన్ వద్ద కొండమల్లిపూడి గిరిజనులు పడిగాపులు కాయడం చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తపరిచారు.
పోలీస్‌స్టేషన్ వద్ద గంటలకొద్దీ పడిగాపులు
ఎస్.కోట రూరల్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోట పోలీస్ స్టేషన్ వద్ద కొండమల్లిపూడి గిరిజనులు పడిగాపులు కాయడం చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఈవిష యంపై సీపీఎం నాయకుడు చెలికాని ముత్యాలు మాట్లాడారు. గిరిజనులు తాము సాగు చేసుకుంటున్న భూముల్లో చెట్లు నరుకుతుంటే.. సదరు భూములు తనవే అని చెప్పుకుంటున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడని, దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు రప్పించారని చెప్పారు. సుమారు 30మంది గిరిజనులు గంటల తరబడి ఆరుబయటే కూర్చున్నారన్నారు. ఇదే విషయంపై ఎస్‌ఐ చంద్రశేఖర్ వివరణ కోరగా.. తన స్థలంలో చెట్లు నరికారని ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు గిరిజనులను స్టేషన్‌కు రమ్మని చెప్పామని, కానీ వారు అధికంగా వచ్చారని. వీరితో మాట్లాడి పంపిద్దామని అనుకుంటే, సీపీఎం నాయకులు అక్కడే ఉండడం వల్ల కుదరలేదన్నారు. ఈ విషయం తర్వాత మాట్లాడదాం.. అని చెప్పి వారిని వెళ్లిపొమ్మని చెప్పినా ఇక్కడే కూర్చున్నారన్నారు.
గిరిజనుడికి అస్వస్థత
పోలీస్‌స్టేషన్ బయట కూర్చున్న కొర్రా ఆనంద్ అనే గిరిజనుడు అస్వస్థతకు గురికావడంతో వెంటనే 108 వాహనంలో సహచర గిరిజనులు తరలించారు. తమకు అండగా ఉండాల్సిన అధికారులు తమకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టించి, తమను ఇబ్బందులు పాలుచేయడం దారుణమని గిరిజన మహిళలు వాపోయారు.