sad position in tenth student పుట్టెడు దుఃఖంలో పరీక్షకు..
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:33 AM
sad position in tenth student నవమాసాలు మోసి.. కని.. పెంచి.. పెద్ద చేసిన ఆ తల్లిని చూస్తూనే పెరిగాడు. అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో సపర్యలు చేస్తూ పదో తరగతి చదివాడు. అమ్మ చెప్పే మాటలు వింటూ రాత్రీపగలు కష్టపడ్డాడు. ఎలాగైనా అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని మనసులోనే సంకల్పించాడు.
పుట్టెడు దుఃఖంలో పరీక్షకు..
ముందురోజు మరణించిన తల్లి
రామభద్రపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): నవమాసాలు మోసి.. కని.. పెంచి.. పెద్ద చేసిన ఆ తల్లిని చూస్తూనే పెరిగాడు. అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో సపర్యలు చేస్తూ పదో తరగతి చదివాడు. అమ్మ చెప్పే మాటలు వింటూ రాత్రీపగలు కష్టపడ్డాడు. ఎలాగైనా అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని మనసులోనే సంకల్పించాడు. తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా మరింత సాధన చేశాడు. మొదటి పరీక్ష మరో 24 గంటల్లో ప్రారంభం కానుందనగా అమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. కళ్ల ముందే ఆమె ప్రాణాలొదిలింది. ఈ ఘటనతో చలించిపోయిన ఆ కుమారుడు గుండెలవిసేలా విలపించాడు. తెల్లారితే పరీక్ష ఉన్నా కన్నీరు ఆగక రోదించాడు. బంధువులు వచ్చి ధైర్యం చెప్పి పరీక్ష రాయాలని సూచించాక బాధను పంటి బిగువున అదిమి పట్టి పరీక్షకు పయనమయ్యాడు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థి ముల్లు కోటేశ్వరరావుకు ఎదురైన కష్టమిది. పదో తరగతి పబ్లిక్ పరీక్ష ముందురోజు తల్లి మరణించడంతో తీవ్రంగా విలపించిన ఆ విద్యార్థి పుట్టెడు దుఃఖంలో పరీక్షకు వెళ్లాల్సి వచ్చింది. కోటీశ్వరరావు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తల్లి ముల్లు రామలక్ష్మి (33) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. శనివారం సాయంత్రానికి ఆమె పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. తండ్రి ఈశ్వరరావు కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తల్లి,కొడుకు మాత్రమే కలిసి ఉండేవారు. ఈ విపత్కర సమయంలో తల్లి మృతిచెందడం, తండ్రి అందుబాటులో లేకపోవడంతో కోటేశ్వరరావు మానసికంగా దిగాలు చెందాడు. బంధువులంతా వచ్చి అండగా ఉంటామని, పరీక్షలు బాగా రాయాలన్న అమ్మ కోరిక నెరవేర్చాలని ప్రోత్సహించారు. ఇంత దుఃఖాన్ని దిగమింగుతూ రామభద్రపురంలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరై సోమవారం తెలుగు పరీక్ష రాశాడు.
-----------------------