Share News

sad politics అంతా భజన

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:33 PM

sad politics జిల్లాలో కూటమి బలంగా ఉంది కానీ మూడు పార్టీల కేడర్‌ దాన్ని కొనసాగించ లేకపోతోంది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం లోక్‌సభ స్థానాన్ని కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది.

sad politics అంతా భజన

అంతా భజన

ఎమ్మెల్యేలు, మంత్రి వద్దకు వ్యక్తిగత సమస్యలతో కేడర్‌

పార్టీ పరిస్థితి, ప్రజాసమస్యల ప్రస్తావన లేదు

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం ఏదీ?

వాటిపై ప్రచారం చేయడంలోనూ వెనుకబాటు

విజయనగరం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కూటమి బలంగా ఉంది కానీ మూడు పార్టీల కేడర్‌ దాన్ని కొనసాగించ లేకపోతోంది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం లోక్‌సభ స్థానాన్ని కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. ప్రభుత్వంపై ప్రజల్లో బలమైన సానుకూలత ఉంది. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూటమి పార్టీల ద్వితీయ శ్రేణి, గ్రామస్థాయి నేతలు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం అనేది కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

వాటి ప్రస్తావనే అధికం..

జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆపై ఇన్‌చార్జి మంత్రిని కలిసే క్రమంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం, స్థానిక నాయకులు పార్టీ బలోపేతం, గ్రామాల్లో అభివృద్ధి పనుల కంటే వ్యక్తిగత సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ‘మా వాడికి ఉద్యోగం, మా వాడి బదిలీ, పదోన్నతి, కాంట్రాక్టు పనులు’ వంటి మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలా కాకుండా తమ గ్రామాన్ని అభివృద్ది చేయండి.. నిధులు మంజూరు చేయండి.. గ్రామాల్లో సమస్యలు ఇవి.. అనే మాటలు వారి నుంచి వినిపించడం లేదు. పైగా కొంతమంది భజన బృందాలు చేరుతున్నాయి. నేతల మధ్య చాడీలు చెబుతూ కాలం గడుపుతున్న వారూ ఉన్నారు. వర్గపోరును నూరిపోస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాలు ఉన్నచోట ఈ తలనొప్పులు అధికంగా ఉన్నాయి. కూటమి కోసం, పార్టీ కోసం, అభివృద్ధి కోసం మాట్లాడేవారి కంటే ఎక్కువగా వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చేవారు అధికంగా ఉన్నారు.

పనులపై కొరవడుతున్న శ్రద్ధ

ఆర్థిక సంవత్సరం మరో వారం రోజుల్లో పూర్తికానుంది. కానీ ఇంతవరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన అభివృద్ధి పనులు చాలాచోట్ల పూర్తికాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగబద్ధ నిధులన్నీ స్థానిక సంస్థలకే దక్కుతున్నాయి. పల్లెపండుగ 1, పల్లెపండుగ 2.0, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం..ఇలా అన్ని పథకాలకు సంబంధించి పనులకు భారీగా నిధులు విడుదలయ్యాయి. వాటిని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చుచేయాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఈ నిధులతో చేయాల్సిన పనుల్లో జాప్యం జరిగింది. దీని గురించి మండల ద్వితీయ శ్రేణి నాయకత్వం, స్థానిక నాయకత్వాలు ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వస్తే చాలు ఎమ్మెల్యేలు, మంత్రి వద్ద వాలిపోతున్నారు. కానీ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల జోలికి మాత్రం పోవడం లేదు.

- ఓ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను అక్కడ ఎమ్మెల్యే పట్టించుకోకపోవటంతో కొంతమంది నాయకులు ఆ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకున్న సందర్భాలు ఉన్నాయి. తనకు తెలియకుండా పరిష్కారం ఎలా అయ్యిందని, ఎమ్మెల్యే అక్కడున్న నాయకులను వాకబు చేశారు. అప్పటి నుంచి ఆ నాయకులను ఎమ్మెల్యే దూరం చేసినట్లు తెలిసింది.

- నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకంమాదవి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు మఽధ్య ఇప్పటికీ సయోద్య కుదరడం లేదు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో గతంలో కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్దపీట వేసి టీడీపీ నాయకులను చిన్నచూపు చూస్తున్నారన్న ఆవేదన తమ్ముళ్లలో బలంగా ఉంది.

- ఇప్పటికైనా కూటమిలో ముందు సమన్వయం రావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరువాత మండల ద్వితీయ శ్రేణి నాయకత్వాలు, స్థానిక నాయకత్వాలు సమన్వయంతో పనిచేయాలి.

--------------------

Updated Date - Mar 24 , 2026 | 11:33 PM