Share News

మరో శ్రీసిటీగా ఎస్‌.కోట

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:34 PM

‘జిందాల్‌ యాజమాన్యం మొదటిగా పెడుతున్న ఇండస్ట్రీయల్‌ పార్కు ఇది.

 మరో శ్రీసిటీగా ఎస్‌.కోట
భూమి పూజకు హాజరైన మంత్రులు అనిత, శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే లలితకుమారి, ఎమ్మెల్సీ రఘురాజు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు

- రైతుల త్యాగఫలమే ఇండస్ట్రీయల్‌ పార్కు

-భూములిచ్చిన వారికి రెండు వారాల్లో చెక్కులు అందిస్తాం

- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు

- జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత

- వర్చువల్‌గా భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు

శృంగవరపుకోట/రూరల్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘జిందాల్‌ యాజమాన్యం మొదటిగా పెడుతున్న ఇండస్ట్రీయల్‌ పార్కు ఇది. భూములిచ్చిన రైతుల త్యాగఫలమే ఈ భూమి పూజ. వీరి సమస్యలకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. రైతులతో జరిగిన చర్చల వివరాలను సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ దృష్టిలో పెట్టాను. వారిచ్చిన సహకారంతో యాజమాన్యం, నిర్వాసిత రైతుల వివాదాన్ని పరిష్కరించగలిగాను. రానున్న రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ తరహాలో ఎస్‌.కోట అభివృద్ధి చెందుతుంది.’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వర్చువల్‌గా శృంగవరపుకోట మండలం పరిధిలోని 1166 ఎకరాల జిందాల్‌ భూమిలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మా ట్లాడుతూ.. ఈ ఇండస్ట్రీయల్‌ పార్కు రైతులకే అంకితమన్నారు. ‘రైతులందరికీ 15 రోజుల్లో చెక్కులు అందిస్తాం. భూములు కోల్పోయిన కుటుంబం నుంచి కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఉండాలని పరిశ్రమ యాజమాన్యానికి సూచించాం. శ్రీసిటీ తరహాలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రూ.530 కోట్లతో 45వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వెనుకబాటు తనం నుంచి వెనుక ఉండి నడిపించే జిల్లాగా విజయనగరం అభివృద్ధి చెందుతుంది. సింగిల్‌ విండో ఎంవోయూ విధానం తీసుకురావడంతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అరకు, పుణ్యగిరి, తాటిపూడిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చుదిద్దుతాం.’ అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవ్‌, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, రాష్ట్ర టూరిజం డైరెక్టర్‌ ఇందుకూరి సుధారాణి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వబ్బిన సత్యనారాయణ, బీజేపీ నాయకుడు దొడ్డి సూర్యారావు, దాసరి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ రత్నాజీ, పరిశ్రమ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌ పోర్టుకు ఎంతదూరం ఉంటుందన్న సీఎం

శృంగవరపుకోట మండలం పరిధిలో ఏర్పాటు చేసే జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు భోగాపురం ఎయిర్‌ పోర్టుకు, అరకు పర్యాటక ప్రాంతానికి ఎంత దూరంలో ఉంటుందని జిందాల్‌ యాజమాన్య ప్రతినిధులను సీఎం చంద్రబాబు అడిగారు. 45 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు ఉంటుందని వారు చెప్పారు. అదే విధంగా అరకు రహదారి సమీపంలోనే పార్కు ఉంటుందని వివరించారు.


శ్రీసిటీ తరహాలో ఎస్‌.కోట:ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ తరహాలో ఎస్‌.కోటలోని జిందాల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కుకు ప్రపంచ ప్రఖ్యాత చెందిన పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రైవేటు ఇండస్ట్రీయల్‌ పార్కులో సూక్ష, చిన్న, మధ్య తరహ (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు నెలకొల్పడం ఆనందంగా వుంది. రైతు కుటుంబాలు స్థానికంగా ఉండేందుకు ఇష్టపడతారు. వ్యవసాయ చేసుకునేందుకు వీలుగా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి పొందాలని చూస్తారు. అందుకే ఎంఎస్‌ఎంఈ నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నాం.

ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి: విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌

జిందాల్‌ భూముల్లో ఇండస్ట్రీయల్‌ పార్కుల ఏర్పాటుకు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా. 20 ఏళ్ల కిందట రైతులు భూములు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ఇండస్ట్రీయల్‌ పార్కులు ఏర్పాటు చేయాలనుకున్నాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వడంలో ఆలస్యంమవడం బాధగా ఉంది. స్థానికంగా ఉద్యోగాలు చేయాలని మహిళలు కోరుకుంటున్నారు. ఈ ఎంఎస్‌ఎంఈలతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.


భూమి పూజ చేయడం సంతోషం: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

భూ నిర్వాసితుల అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు జిందాల్‌ యాజమాన్యం తరఫున జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగల పూడి అనిత హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతుల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ పరిశ్రమకు భూమిలిచ్చిన రైతులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలే. 2006-2007లో పరిశ్రమ కడతామని చెప్పడంతో భూములిచ్చారు. ఇప్పటికైనా భూమి పూజ చేయడం సంతోషం.

ఎన్నో ఏళ్ల కల నెరవేరింది: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

ఎన్నో సంవత్సరాల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుంది. రైతులు భూములను ఇవ్వడం వల్లే పరిశ్రమల స్థాపన జరుగుతుంది. జిందాల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణంతో ఈ నియోజకవర్గ ముఖ చిత్రం మారుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నియోజకవర్గ పరిధిలోని కొత్తవలస మండలం బలిఘట్టం, చినరావుపల్లి గ్రామాల పరిధిలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం.

Updated Date - Jul 03 , 2026 | 11:34 PM