విశాఖకు ఎస్.కోట పంచాయితీ!
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:56 PM
స్థానిక ఎన్నికల్లో పదవుల పంపకంపై శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి ముదురుతోంది.
సీట్ల సర్దుబాటుపై టీడీపీలో ముదురుతున్న అసంతృప్తి
జామిలో 13 గ్రామాల నాయకుల రాజీనామాల హెచ్చరిక
ఎస్.కోటలో రిజర్వేషన్లతో మారిన సమీకరణాలు
వేపాడలో తాత్కాలిక సర్దుబాటు.. నేడు విశాఖలో కీలక చర్చలు
శృంగవరపుకోట, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో పదవుల పంపకంపై శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి ముదురుతోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందాల అమలుపై జామి, వేపాడ, ఎస్.కోట మండలాల్లో విభేదాలు తలెత్తాయి. జామిలో 13 గ్రామాల నాయకులు రాజీనామాలకు సిద్ధపడగా, వేపాడలో తాత్కాలిక సర్దుబాటు జరిగినట్లు సమాచారం. ఎస్.కోటలో రిజర్వేషన్లతో సమీకరణాలు మారడంతో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ సోమవారం విశాఖపట్నంలో చర్చలు జరపనున్నారు.
జామిలో రాజీనామాల హెచ్చరిక
జామి మండలంలోని 13 గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ అభ్యర్థి ఎంపికలో తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పార్టీ సమావేశం నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు రాజీనామా లేఖ పంపారు. మండల పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితోపాటు నీటి సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఒప్పందం ప్రకారం ఎంపీపీ పదవిని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లగుడు రవికుమార్‌కు కేటాయించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయంపై స్థానిక నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని మరో 12 గ్రామాల నాయకుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
వేపాడలో తాత్కాలిక సర్దుబాటు
వేపాడలో సీట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం విలేకరుల సమావేశంలో తమ అభ్యంతరాలు వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో లక్కవరపుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆమె భర్త కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ సమక్షంలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం బానాది గ్రామానికి చెందిన గొంప వెంకటరావుకు ఎంపీపీ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోట్యాడ రమణమూర్తికి జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని నేతలు సూచించారు. ఆ స్థానం మహిళకు రిజర్వు కావడంతో ఆయన తన భార్య వెంకటలక్ష్మిని బరిలోకి దింపి, తనకు వైస్ ఎంపీపీ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎంపీటీసీలుగా గెలిచే స్థానిక నాయకులు, కార్యకర్తలకూ పదవుల్లో అవకాశం కల్పించాలన్న షరతుతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎస్.కోటలో పదవులపై పోటీ
ఎస్.కోట మండలంలో సార్వత్రిక ఎన్నికల ఒప్పందం ప్రకారం అలుగుబిల్లికి చెందిన రాయవరపు చంద్రశేఖర్‌కు ఎంపీపీ పదవి దక్కాల్సి ఉంది. అయితే మండలం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో సమీకరణాలు మారాయి. తనకు వైస్ ఎంపీపీ పదవితోపాటు, తన అనుచరులకు ఎంపీపీ పదవి ఇవ్వాలని చంద్రశేఖర్ కోరుతున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఏపీ టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుబ్బలక్ష్మి కూడా పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న తన భార్య రెడ్డి భవానీకి జడ్పీటీసీ అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో పదవుల సర్దుబాటు పార్టీ నేతలకు సవాల్‌గా మారింది.
ఇతర మండలాల్లోనూ ఆశావహులు
లక్కవరపుకోట మండల పార్టీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సోదరి కోళ్ల ఉషాను, జడ్పీటీసీ అభ్యర్థిగా మండల టీడీపీ అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు భార్య కనకమహాలక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం. కొత్తవలసలో ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. గోరపల్లి రాము తన భార్య సుజాతకు జడ్పీటీసీ అవకాశం కల్పించాలని, ఈసారి ఎంపీపీ లేదా జడ్పీటీసీ పదవుల్లో ఏదో ఒకటి తమకు ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చిన్నశ్రీనుతో కలిసి పనిచేసిన గోరపల్లి శివ, నెక్కల నాయుడుబాబు తదితరులు కూడా పదవులను ఆశిస్తున్నారు. సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండటంతో సర్దుబాటు కష్టంగా మారింది.