Share News

Red-Handed! అడ్డు తొలగించాలనుకుని.. అడ్డంగా దొరికేశారు!

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:07 AM

rying to Clear the Hurdle, They Got Caught Red-Handed! వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనుకుంది. ఈ మేరకు ప్రియుడు, తమ్ముడితో కలిసి హత్యకు పథక రచన చేసింది. అయితే వారు ముగ్గురూ పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. చివరకు పోలీసులకు చిక్కారు.

 Red-Handed! అడ్డు తొలగించాలనుకుని.. అడ్డంగా దొరికేశారు!

  • బెడిసికొట్టిన వ్యూహం

సాలూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనుకుంది. ఈ మేరకు ప్రియుడు, తమ్ముడితో కలిసి హత్యకు పథక రచన చేసింది. అయితే వారు ముగ్గురూ పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం రూరల్‌ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కిర్ల కుమార్‌కు విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మతో 20 సంవత్సరాల కిందట వివాహమైంది. వారికి కొడుకు , కుమార్తె ఉన్నారు. కాగా నాలుగేళ్ల కిందట నుంచి విశ్వనాథపురానికి చెందిన వరుసకు సోదరుడైన సారిక తవుడునాయుడుతో ఈశ్వరమ్మకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త కుమార్‌ పలుమార్లు భార్యను మందలించాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అయినప్పటికీ ఈశ్వరమ్మ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల 3న ఒక ఇంటిలో ఆమెతో పాటు తవుడునాయుడు భర్తకు పట్టుబడ్డారు. దీంతో ఎలా అయినా భర్తను అడ్డు తొలగించుకోవాలని ఈ నెల 5న ప్రియుడు తవుడునాయుడు, తమ్ముడు పాపారావుతో కలిసి పథక రచన చేశారు. దీనిలో భాగంగా ఉదయం 6 గంటలకు మొక్కజొన్న పంట పనులు చూసిరావాలని ఈశ్వరమ్మ చెప్పడంతో భర్త పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడున్న పాపారావుతోపాటు భార్య ఈశ్వరమ్మ కుమార్‌ మెడలో తువ్వాలు చుట్టీ చంపేందుకు ప్రయత్నించగా.. వారికి తవుడు నాయుడు కూడా సహకరించాడు. ఈ పెనుగులాటలో చిన్నపాటి గాయాలతో తప్పించుకున్న కుమార్‌ సాలూరు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. అనంతరం ఈ నెల 7న పాచిపెంట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ అర్జున్‌తో పాటు సాలూరు సీఐ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. భర్తపై హత్యాయత్నానికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో నింది తులైన ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు తవుడునాయుడు, సోదరుడు పాపారావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Feb 10 , 2026 | 12:07 AM