‘సాలూరు-విశాఖ రైలు నడపండి’
ABN , Publish Date - May 29 , 2026 | 12:10 AM
సాలూరు-బొబ్బిలి మీదుగా విశాఖపట్నం వరకూ రైలు నడపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
బొబ్బిలి,మే 28 (ఆంధ్రజ్యోతి): సాలూరు-బొబ్బిలి మీదుగా విశాఖపట్నం వరకూ రైలు నడపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అలాగే బొబ్బిలి రైల్వే వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ పునరుద్ధరించాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూన్ 3న బొబ్బిలి రైల్వే స్టేషన్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని గురువారం స్థానిక రైల్వేస్టేషన్ ఎదుట కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి నుంచి సాలూరు వరకు రైలు మార్గంలో పది గ్రామాలకు చెందిన 15 వేల మంది ప్రజలు నివసిస్తున్నారన్నారు. ఈ గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేదని, వారికి రైలు ఆదరువు అన్నారు. విద్య, వైద్యం తదితర అవసరాల కోసం ప్రజలు రైలుపై అధికంగా ఆధారపడుతుంటారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సాలూరు- విశాఖ మధ్య రైలును నడపాలన్నారు. కరోనా సమయంలో రైలును రద్దు చేసి ఇప్పటివరకు పునరుద్ధరించక పోవడంతో ఈ ప్రాంతీయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పి.శంకరరావు, మెరుగని గోపాలం, శ్రీనివాస్, అప్పన్న, మువ్వల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.