‘సాలూరు-విశాఖ రైలు నడపండి’
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:28 AM
సాలూరు - విశాఖపట్నం రైలు నడపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం బొబ్బిలి రైల్వేస్టేషన్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
బొబ్బిలి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): సాలూరు - విశాఖపట్నం రైలు నడపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం బొబ్బిలి రైల్వేస్టేషన్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు చోడిగంజి రమేశ్‌నాయుడు, పొట్నూరు శంకరరావు తదితరులు మాట్లాడుతూ సాలూరు-బొబ్బిలి రైల్వే మార్గంలో సుమారు 10 గ్రామాలకు చెందిన 15 గ్రామాల వారికి రైలు రవాణా సౌకర్యం కల్పించడం చాలా అవసరమన్నారు. గిరిజన గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందన్నారు. విశాఖ నుంచి బొబ్బిలి, సాలూరు ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారికి ప్రస్తుతం సరైన రైలు సదుపాయం లేక పోవడం ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికుల వినతుల మేరకు రైల్వే అధికారులు సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విశాఖపట్నానికి మెమో రైలు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో ట్రయల్ రన్ వేసి అంతటితో ఆపేశారన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. మెమో రైలు రాకపోకలు సాగించేలా రైల్వే అధికారులను ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రైలు సర్వీసుతో పాటు స్ధానిక రైల్వేస్టేషన్‌లో సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే బొబ్బిలిలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగే రైల్వే వ్యాగన్ లోడింగ్, అన్‌లోడింగ్ పాయింట్‌ను ఎత్తివేయడంతో సుమారు వెయ్యి మంది హమాలీలకు ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాయింట్‌ను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం స్థానిక రైల్వే అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు వెంకటరమణ, వేమిరెడ్డి లక్ష్మునాయుడు, పిల్లా లక్ష్మణరావు, కె.సత్యం నాయుడు, వి.శేషగిరి, బంకురు జోగినాయుడు, గేదెల చంద్రినాయుడు, ఎస్.గోపాలం, లంక తిరుపతి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.