Rules? Thumbs Down! రూల్స్.. తూచ్!
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:29 AM
Rules? Thumbs Down! పాలకొండ నగర పంచాయతీలో జనరల్ ఫండ్ వినియో గంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాటిని వెచ్చిస్తున్నా.. పట్టిం చుకునే వారే కరువయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి అనుమతులు
9 నెలల్లోనే రూ.1.50 కోట్ల పనులకు ఆమోదం
అధికారులు, పాలకవర్గం తీరుపై విమర్శల వెల్లువ
పాలకొండ, జనవరి3(ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీలో జనరల్ ఫండ్ వినియో గంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాటిని వెచ్చిస్తున్నా.. పట్టిం చుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, అవసరమైన పనిముట్లు కొనుగోలుకు మాత్రమే ఈ నిధులు కేటాయించాలి. వాటికి సంబంధించి మూడు నెలలకు అవసరమైన నిల్వలను ముందస్తుగానే అందుబాటులో ఉంచుకోవాలి. మిగిలిన జనరల్ ఫండ్‌తో చిన్నపాటి మరమ్మతు పనులు, అత్య వసర పనులకు మాత్రమే వినియోంచాలి. అయితే నగర పంచాయతీలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొంది. శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనులకు ఆ నిధులను ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. మొత్తంగా జనరల్ ఫండ్‌ను క్యాపిటల్ వర్క్స్‌కు ఖర్చు చేయడంపై పట్టణ ప్రజలు మండి పడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. చాలీచాలని పనిముట్లతో సిబ్బంది పనిచేస్తున్నారు. బ్లీచింగ్ , దోమల నివారణకు ఫాగింగ్‌కు వెచ్చిస్తున్న నిధులు అంతంతమాత్రమే. తాగునీరు శివారు ప్రాంతాలకు అందడం లేదు. తాగునీరు పైపులైన్లు అక్కడక్కడ మరమ్మతులకు గుర య్యాయి. కొన్నిచోట్ల అరకొరగానే కలుషిత నీరు సరఫరా అవుతుంది. వాటి నిర్వహణకు ఖర్చు చేస్తుంది కూడా నామమాత్రమే. మరోవైపు పట్టణంలో ఏ ప్రాంతం చూసినా అంధకారమే. వీధి దీపాలు సక్రమంగా పనిచేయడం లేదు. అయితే వీటి కోసం ఖర్చుచేయాల్సిన జనరల్ ఫండ్‌ను సీసీ రోడ్లు, డ్రెయిన్లు కోసం వెచ్చిస్తున్నారు. మున్సిపల్ అడ్మి నిస్ర్టేటివ్‌లో నిబంధనలను ఉల్లం ఘిస్తూ.. నగర పంచాయతీ అధికారులు, పాలకవర్గం వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశ మవుతోంది.
- ప్రస్తుతం నగర పంచాయతీలో జనరల్ ఫండ్ రూ. 8లక్షలు మాత్రమే ఉంది. అయితే కోటి 50 లక్షలకు సంబంధించి గడిచిన తొమ్మిది నెలల్లో 49 పనులకు (సీసీ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు) ఆమోదం తెలపడం ఎంతవరకు సమంజసమో అధికారులకే తెలియాలి. అయితే మంజూరైన వాటిల్లో 15 పనులు పూర్తయ్యాయి. మరో ఎనిమిది పనులు ప్రోగ్రస్‌లో ఉన్నాయి. ఆరింటికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. మరో 20 పనులకు నగర పంచాయతీ పాలకవర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కాగా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టే అత్యవసర పనులకు జనరల్ ఫండ్ నిల్వలు కరువవుతున్నాయి. చేపట్టిన పనులకు ఎప్పుడు బిల్లులు మంజూరు అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
- నిధుల లేమి కారణంగా పాలకొండ నగర పంచాయతీ 2022 సెప్టెంబరు నుంచి కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయి మొత్తం 1.70 కోట్ల చేరింది. ఈ మొత్తాన్ని జనరల్ ఫండ్ నుంచే చెల్లించాల్సి ఉంది. అయిటే ఇటువంటి వాటిపై దృష్టిపెట్టకుండా పాలకులు సీసీరోడ్లు, డ్రైయిన్లు ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులతోనే శాశ్వత ప్రాతిపదికన పనులు చేప ట్టాల్సి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా క్యాపిటల్ వర్క్స్‌కు జరనరల్ ఫండ్‌ను కేటా యించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాలకవర్గ సమావేశాల్లో ప్రశ్నించారు. అయినా అధికారులు తీరు మారలేదు.
- దీనిపై నగర పంచాయతీ కమిషనర్ రత్నంరాజును వివరణ కోరగా.. ‘పాలకవర్గం ఆమోదం మేరకే పాలకొండలోని పలు చోట్ల సాధారణ నిధులతో క్యాపిటల్ వర్క్స్‌కు చేపడు తున్నారు. గతంలో పనిచేసిన కమిషనర్లు జనరల్ ఫండ్‌ను ఆ పనులకు కేటాయించారు. ’ అని తెలిపారు.