మాజీ సైనికులకు ఇచ్చిన భూమిపై రగడ
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:24 AM
మండలంలోని సదానంద పురం గ్రామంలో గల కొండ ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని మాజీ సైనికులు మంగళవారం సాగు చేసు కుంటుంటే ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు.
గుర్ల, జనవరి 27(ఆంధ్రజ్యో తి): మండలంలోని సదానంద పురం గ్రామంలో గల కొండ ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని మాజీ సైనికులు మంగళవారం సాగు చేసు కుంటుంటే ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. అక్కడే టెంట్ వేసి, నిరసన చేపట్టారు. తమ పశువులను, మేకలను ఎక్కడ మేపాలని వారితో వాద నకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సేవను గుర్తించి తమకు కొండ ప్రాంతాల్లో భూములు ఇచ్చాయని, ఇలా అడ్డుకోవడం భావ్యం కాదని మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గ్రామస్థులు ‘ఈ భూములు మాకు కావాలి. మీరు వేరే చోట తీసుకోండి. ఈ భూములే మాకు జీవనాధారం’ అని పట్టుబట్టారు. 20 ఏళ్ల కిందట తమకు ఇక్కడ భుములు ఇస్తే ఇప్పుడు కొత్తగా ఎందుకు అల్లరి చేస్తున్నారని మాజీ సైనికులు ప్రశ్నించారు.
అదనంగా ఆక్రమిస్తే చర్యలు తప్పవు
ఇదే విషయమై గుర్ల తహసీల్దార్ ఆదిలక్ష్మిని వివరణ కోరగా.. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సైనికులకు ఇచ్చిన భూముల వివరాలను సేకరించి.. వాటిని పరిశీలిస్తామని చెప్పారు. వారు అదనంగా ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.