నిజాయితీ చాటిన ఆర్టీసీ ఉద్యోగులు
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:40 AM
బస్సులో రూ.లక్ష నగదు, మొబైల్ ఫోన్, దుస్తులతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయి వెళ్లిన సదరు ప్రయాణి కుడికి తిరిగి దాన్ని అందజేసి ఆర్టీసీ ఉద్యోగులు నిజాయతీ చాటుకున్నారు.
పాలకొండ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): బస్సులో రూ.లక్ష నగదు, మొబైల్ ఫోన్, దుస్తులతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయి వెళ్లిన సదరు ప్రయాణి కుడికి తిరిగి దాన్ని అందజేసి ఆర్టీసీ ఉద్యోగులు నిజాయతీ చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాలకొండ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి గురువారం పాలకొండకు బయలుదేరింది. తెనాలికి చెందిన ఒట్టిగుట్ల నాగేశ్వరరావు విశాఖపట్నం వెళ్లేందుకు విజయవాడలో బస్సు ఎక్కారు. అయితే విశాఖ దిగేటప్పుడు ఆయన తన బ్యాగ్‌ను బస్సులో మరిచిపోయారు. బ్యాగ్‌ను గమనించిన ఇద్దరు బస్సు డ్రైవర్లు దాన్ని పాలకొండ డిపోలో అప్పగించారు. సెక్యూరిటీ సమక్షంలో బ్యాగ్‌ను తెరిచి చూడగా బ్యాగ్‌లో ఓ మొబైల్ ఫోన్, రూ. లక్ష, దుస్తులు ఉన్నట్టు గుర్తించారు. సదరు సెల్‌ఫోన్ ద్వారా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దాంతో శుక్రవారం ఆయన కుమార్తె కంకనాల జ్యోతి పాలకొండ డిపోను సంప్రదిం చారు. దాంతో ప్రజా రవాణా అధికారి కె.శ్రీనివాసరావు, డిపో మేనేజర్ బి.ఎస్.ఎన్.మూర్తి, అసిస్టెంట్ మేనేజర్ యు.రమేశ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎం.చాణక్య, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ ఎల్.రాము.. ఆ బ్యాగ్‌ను జ్యోతికి అందించారు. ఈ సందర్భంగా అమె ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు బంగారునాయుడు, రమేశ్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.