Share News

RTC Bus వంతెనను ఢీ కొని.. ఆర్టీసీ బస్సు బోల్తా

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:15 AM

RTC Bus Overturns After Hitting Bridge గుమ్మలక్ష్మీపురానికి అతి సమీపంలో ఉన్న మండ గ్రామంలో వంతెనను ఢీ కొన్ని ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఇందులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చు కున్నారు.

  RTC Bus  వంతెనను ఢీ కొని..  ఆర్టీసీ బస్సు బోల్తా
అదుపు తప్పి బోల్తాపడిన బస్సు

గుమ్మలక్ష్మీపురం, జనవరి14(ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురానికి అతి సమీపంలో ఉన్న మండ గ్రామంలో వంతెనను ఢీ కొన్ని ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఇందులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చు కున్నారు. డ్రైవర్‌, కండక్టర్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. వారు కురుపాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా రోజూలానే బుధవారం సాయంత్రం పార్వతీపురం డిపో నుంచి బయల్దేరిన ఈ బస్సు రాత్రి ఏడున్నరకి గుమ్మలక్ష్మీపురం చేరుకుంది. 7:45 గంటలకు తిరుగు ప్రయాణమైంది. సుమారు ఐదు కిలోమీటర్లు సాఫీగానే వెళ్లిన బస్సు మండ గ్రామ సమీపంలో అదుపుతప్పింది. వంతెనను ఢీ కొని బోల్తా పడింది. ఆ వంతెన కింద మండ గెడ్డ ప్రవహిస్తుండగా.. ఏ మాత్రం బస్సు కింద పడినా.. సుమారు 20 అడుగుల లోతుకు చేరుకునేది. వంతెనకు మధ్యలోనే బస్సు బోల్తా పడి ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. దీనిపై డ్రైవర్‌ను వివరణ కోరగా.. ‘బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది.. ఆ తర్వాత స్టీరింగ్‌ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.’ అని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా పార్వతీపురం-గుమ్మలక్ష్మీపురం మధ్య భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్విన్‌పేట పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంతెన మధ్య బోల్తా పడిన బస్సును తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jan 15 , 2026 | 12:15 AM